మంచాల, డిసెంబర్ 20: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏర్పడి ఏడాది అవుతున్నప్పటికీ అభివృద్ధిని మరిచి అరాచకాలు, అక్రమాలకే పెద్దపీట వేసిందని మంచాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు. శుక్రవారం మంచాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి వాటిపి విస్మరించిందని ఆరోపించారు.
రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 30శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. గిరిజన వసతి గృహల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సరైన వసతులు లేక ఎంతో మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవుతున్న కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లారెడ్డి, బహుదూర్నాయక్, చంద్రయ్య, కిషన్‌రెడ్డి, రవి, విష్ణువర్ధన్‌రెడ్డి, రఘుపతి, బద్రినాథ్గుప్తా, విజయ్, శేఖర్, శంకర్, ప్రశాంత్కుమార్యాదవ్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మూలా ఈ -కారు రేస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్‌కు గుర్తింపు తీసుకొచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, నాయకులు కొత్త నర్సింహారెడ్డి అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే ఈ-కారు రేసు ఏర్పాటు చేయడం జరిగిందని.. కానీ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమంగా ఏసీబీ కేసు నమోదు చేయించారని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అక్రమంగా పెడుతున్న కేసులను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు ఎంఏ రవూఫ్, నర్సింహగౌడ్, వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పి.జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, డేవిడ్, షాబాద్ ప్రవీణ్, పరమేశ్, చిన్న, అరవింద్, సునీల్‌కుమార్, అసీప్, షరీఫ్, భాస్కర్, రాజు, కిరణ్, రాజు, అమేర్, అలీమ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతో అక్రమ కేసులు బనాయిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఏనుగు భరత్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టడాన్ని శుక్రవారం తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచటం కోసం కేటీఆర్ పనిచేస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎత్తిచూపుతున్నాడన్న భయంతో లేనిపోని కేసులు పెట్టాలని చూస్తుండడం సరికాదన్నారు.