తాండూరు రూరల్, ఫిబ్రవరి 26 : శివరాత్రి పండుగ సందర్భంగా భూ కైలాస్ ఆలయం సుందరంగా ముస్తాబైంది. తాండూరు మండలం, అంతారం తండాలో వెలసిన భూ కైలాస్ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహిస్తారు. భక్తులు కర్ణాటక, మహారాష్ట్రతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలిరానున్నారు. తాండూరు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అంతారం తండా ఉన్నది. శివస్వాములు కొంత మంది ఇక్కడే మాలను తీస్తారు.
భూ కైలాస్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. వీటిని నీటిలో ఏర్పాటు చేశారు. ఒక్కో లింగాన్ని దర్శించుకుంటూ భక్తులు వెళ్తారు.
ఆలయ ప్రాంగణంలో ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్తోపాటు నర్సు, ఉచితంగా మందుల పంపిణీ చేయనున్నారు.
వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాల పార్కింగ్ కోసం ఆలయ సమీపంలో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. వికలాంగుల కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. రవాణా సౌకర్యంతో పాటు నిత్య అన్నదానం, తాగునీటి సౌకర్యం ఉంటుంది. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేందర్రెడ్డితోపాటు పోలీసుల సహకారం తీసుకుంటున్నాం.
– ఓం నమః శివాయ ట్రస్ట్ చైర్మన్ వాసు పవర్ నాయక్
తలకొండపల్లి, ఫిబ్రవరి 26 : మండలంలోని చెన్నారం గ్రామ గుట్టపై వెలసిన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి నిర్వహించనున్నట్లు మాజీ సర్పంచ్, ఆలయ అధ్యక్షుడు పాండయ్య, చైర్పర్సన్ ఎమిరెడ్డి కౌసల్య, మల్లారెడ్డి, పాండురంగారెడ్డి శనివారం తెలిపారు. నేడు అభిషేకం, గణపతిపూజ, 28న గణపతి పూజ, ఏకవార రుద్రాభిషేకం, పాశుపతరుద్రహోమం, అగ్నిగుండ మహోత్సవం, 1న అలంకార మహోత్సవం, మల్లికార్జున స్తుతి గ్రంథావిష్కరణ, స్వామివారి కల్యాణోత్సవం, జాగరణ, భజనలు, గణపతిపూజ, స్వామివారికి అభిషేకం, భజనలు, అగ్నిగుండ మహోత్సవం, 2న కడవ, బోనాలు, పారాయణాలు, సామూహిక అర్చనలు, ఆరాధన సేవతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
ఏటా శివరాత్రి ఉత్సవాలకు మహబుబ్నగర్, నాగర్కర్నూల్, హైదరాబాద్, జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. గత ఏడాది రూ.కోటితో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఏడాది వాటర్ ట్యాంక్, సీసీ రోడ్డు, వసతిగృహ నిర్మాణాలను చేపట్టారు. మల్లప్పగుట్టపై ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్నంత ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
యాచారం: మండలంలోని నందివనపర్తి గ్రామంలో కొలువుదీరిన నందీశ్వర మహాక్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని మూడురోజుల పాటు జాతర కొనసాగనున్నది. ఎనిమిదడుగుల మహానంది, శివలింగం, అమ్మవారి విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా విద్యుత్ దీపాలను అలంకరించడంతో జిగేల్మంటున్నాయి. తెలంగాణలోనే అతిపెద్ద కళాత్మకమైన నంది విగ్రహం ఇక్కడ ఉన్నది. ఈ జాతరకు మండలవాసులే కాకుండా పక్క మండలాల ప్రజలు, హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరిలివస్తారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ జాతర మహోత్సవాన్ని గురుపల్ల నాగేందర్రావు అనువంశీ కులు పల్లా సావిత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఆలయం ఎదుట ఇప్పటికే వ్యాపారులు పలు రకాల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. మార్చి 1, 2, 3 తేదీల్లో ఆలయప్రాంగణం శివనామస్మరణతో మార్మోగనున్నది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న ఉదయం 6 గంటల నుంచి అఖండ దీపారాధన, గణాధిపతిపూజ కలశస్థాపన, ఉదయం 8 గంటల నుంచి ధ్వజారోహణం, మహన్యాస పూర్వక నిరంతర ఏకాదశ రుద్రాభిషేకాలు, రాత్రి 8 గంటల నుంచి మహాశివరాత్రి జాగారం, రాత్రి 12 గంటలకు లింగోద్భవం, రుద్రాభిషేకం, 2న ఉదయం 6 గంటలకు రుద్రాభిషేకాలు, 8.30 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు, సాయంత్రం 4 గంటల నుంచి పార్వతీపరమేశ్వరుల కల్యాణం, 3న ఉదయం ఆరు గంటలకు రథోత్సవం, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, పార్వతీ దేవికి ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నందీశ్వర క్షేత్రంలో జరిగే శివరాత్రి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేశాం. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– కంబాలపల్లి ఉదయశ్రీ, సర్పంచ్, నందివనపర్తి