వికారాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ఆరు నెలల్లోనే జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. ఆరు గ్యారెంటీలతోపాటు రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్లు పెంచుతామని వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ఆరు నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మినహా ఏ హామీనీ నెరవేర్చలేకపోయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టడంతో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గడం గమనార్హం. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రత్యేక దృష్టి సారించి బహిరంగ సభలు, సమావేశాలతో విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని తీసుకురావడంలో ఫెయిలయ్యారనే చెప్పుకోవచ్చు.
అయితే సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. మరోవైపు జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు వచ్చిన మెజార్టీ కన్నా అధిక మెజార్టీ వచ్చేలా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీ వచ్చి, పార్లమెంట్ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో మెజార్టీ తగ్గడం, మరో రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అధిక్యత సాధించి, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం కావడంపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి అనంతరం ఎమ్మెల్యేలు తమ గెలుపునకు పనిచేశారా లేదనే అనుమానాన్ని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 10,678 ఓట్లు తగ్గాయి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 1,07,429 ఓట్లురాగా, పార్లమెంట్ ఎన్నికల్లో 84,414 ఓట్లు వచ్చాయి. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 6086 ఓట్ల మేర తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 86,477 ఓట్లురాగా, పార్లమెంట్ ఎన్నికల్లో 73,993 ఓట్లు వచ్చాయి.
మరోవైపు జిల్లాలోని పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యం రావడంతో కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో 20 వేలకుపైగా మెజార్టీ రాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 2003 ఓట్ల ఆధిక్యత సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్కు 96,284 ఓట్లురాగా, పార్లమెంట్ ఎన్నికల్లో 71,785 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక తాండూరు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 84,662 ఓట్లురాగా, పార్లమెంట్ ఎన్నికల్లో 69,864 ఓట్లు రావడం గమనార్హం.