పరిగి, ఫిబ్రవరి 9 : పరిగి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ఐదు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను ఎవరు ఇస్తారో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని మాజీ సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. ఐదేండ్లపాటు గ్రామపంచాయతీ సర్పంచ్‌లుగా పని చేసిన తాము పల్లెల అభివృద్ధి కోసం అప్పులు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018లో పరిగి మున్సిపాలిటీ ఏర్పడగా ఐదేండ్ల పదవీకాలం పూర్తైన తర్వాత జనవరి 28వ తేదీన ఐదు కిలోమీటర్ల పరిధిలోని ఆరు గ్రామాలను పరిగి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా నస్కల్, శాఖాపూర్, రుక్కుంపల్లి, సుల్తాన్పూర్, నజీరాబాద్, సయ్యద్మల్కాపూర్లు పరిగి మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో గ్రామపంచాయతీల రికార్డులన్నీ మున్సిపాలిటీ వారు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు అక్కడ గ్రామపంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారు రికార్డులను మున్సిపాలిటీలకు అప్పగించాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్‌కు అప్పగించారు. సంబంధిత గ్రామపంచాయతీల ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లు, ఇతర వివరాలతోపాటు పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నది. కానీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రావాల్సిన బిల్లులు ఎలా చెల్లిస్తారని మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.
లక్షల్లో బిల్లుల పెండింగ్..
పరిగి మున్సిపాలిటీలో ఆరు గ్రామాలు విలీనమవగా అందులో నస్కల్, రుక్కుంపల్లి, సుల్తాన్పూర్, నజీరాబాద్, సయ్యద్‌మల్కాపూర్ ఐదు గ్రామపంచాయతీలు ఉన్నాయి. సయ్యద్‌మల్కాపూర్ గ్రామపంచాయతీలో సుమారు రూ.45లక్షల వరకు బిల్లులు అందాల్సి ఉన్నది. ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి మరో రూ.15లక్షలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. రుక్కుంపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి రూ.30లక్షలు, సుల్తాన్‌పూర్‌లో రూ.6లక్షలు, నస్కల్లో రూ.5లక్షలు, నజీరాబాద్‌లో రూ.2లక్షల బిల్లులు రికార్డు చేయబడి రావాల్సినవి ఉన్నట్లు సమాచారం. వీటికితోడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న బోర్ల మరమ్మతు, వీధిదీపాల ఏర్పాటు, ఇతర చిన్న పనులకు సంబంధించి చేపట్టిన పనులకు లక్షల్లో బిల్లులు రావాల్సి ఉన్నాయి.
వాటిని ఎంబీ రికార్డు సైతం చేయలేదని సమాచారం. ప్రతి మాజీ సర్పంచ్‌కు లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఐదు గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో తమ బిల్లులపై స్పష్టత ఎవరు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే పనులు చేసి రికార్డు కాని వాటి పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. ప్రజల కోసం తాము పని చేశామని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన పనులకు ఇప్పటికీ కొన్ని రికార్డులు కాలేదని, అలాంటి వాటికి బిల్లులు ఎలా ఇస్తారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చేపట్టిన పనులన్నింటికీ బిల్లులు ఇవ్వాలని మాజీ సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బిల్లులపై స్పష్టత ఇవ్వాలి..
గ్రామాల్లో చేపట్టిన పనుల బిల్లులపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. రుక్కుంపల్లి గ్రామంలో సుమారు రూ.30 లక్షల వరకు బిల్లులు రావాలి. వీధిదీపాలు, బోర్ల మరమ్మతులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి మరో రూ.7లక్షలు రావాలి. మా గ్రామాన్ని పరిగి మున్సిపాలిటీలో విలీనం చేశారు. బిల్లులు ఎవరు ఇస్తారనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇంకా ఎంబీ రికార్డు చేయాల్సిన వాటిని వెంటనే రికార్డు చేయించి బిల్లులు అందజేయాలి.
– ఆర్.శ్రీనివాస్, మాజీ సర్పంచ్, రుక్కుంపల్లి