గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్యులకు సహాయకులుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మేలుజాతి దూడలను పెంపొందించడంలో ఎదకు వచ్చిన పశువులకు ప్రభుత్వం అందించే సెమన్ ఇస్తారు. అంతేకాకుండా పశువులు, జీవాలకు వ్యాక్సినేషన్ వేయడంలోనూ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. పశు సంపద అభివృద్ధిలో ప్రభుత్వ సిబ్బందికి పోటీగా పనిచేస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం గత పది నెలలుగా వేతనాలు మంజూరు చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
– షాబాద్, జూలై 13
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొత్తం 80 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. వీరు పశువుల సంరక్షణ, సంతతి పెంపు విషయంలో కీలకంగా పనిచేస్తున్నారు. కృత్రిమ గర్భధారణలో మేలు జాతి పశువుల సంతతి పెంచడం, పశుగ్రాసం పెంపకం, దూడల పోషణ, పశువుల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, నట్టల నివారణ మందు పంపిణీ, వ్యాక్సినేషన్ వంటి పనుల్లో పశువైద్య సిబ్బందికి సహాయపడుతున్నారు.
కాగా, వీరి సేవలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ జీవోను కూడా జారీ చేసింది. వీరికి మొదట్లో రూ.3 వేల వేతనం అందించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.8,500 చేసింది. తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.11,050కి పెంచి ప్రతినెలా సక్రమంగా వేతనాలను అందించింది.
పది నెలలుగా అందని వేతనం
గోపాలమిత్రలు పది నెలలుగా వేతనాలు అందక గోసపడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ సైతం భారమై ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేతనాలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా కనీస స్పందన లేకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. గోపాలమిత్రలు ప్రతినెలా ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలి. లేకుంటే వేతనంలో కోత తప్పదు.
నెలలో ఒక్కో గోపాలమిత్ర సుమారు 100 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు పాడి రైతుల నుంచి గోపాలమిత్రలు రూ.40 చొప్పున వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి. ఏదైనా ఒక నెలలో టార్గెట్ పూర్తి కాకుంటే వేతనంలో కోతపడుతుంది. గత 25ఏండ్లుగా ప్రభుత్వ సిబ్బందితో సమానంగా రైతులకు సేవలందిస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నాం
ప్రభుత్వం నుంచి సకాలంలో వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. గ్రామాల్లో మేలుజాతి దూడలను పెంపొందించడంలో ఎదకు వచ్చిన పశువులకు ప్రభుత్వం అందించే సెమన్ ఇస్తున్నాం. పశువులు, జీవాలకు వ్యాక్సినేషన్ వేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాం. ప్రభుత్వం గత పది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది.
– విద్యాసాగర్, గోపాలమిత్ర, షాబాద్ మండలం
సమస్యలు పరిష్కరించాలి
గత 25 ఏండ్లుగా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలి. పది నెలలుగా వేతనాలు రాక గోపాలమిత్రలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితంలేదు. సర్వీసును పరిగణనలోకి తీసుకుని గోపాలమిత్రలను క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న పది నెలల వేతనాన్ని విడుదల చేయడంతోపాటు సమస్యలను పరిష్కరించాలి.
– శ్రీనివాస్, గోపాలమిత్ర సంఘం రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు