రంగారెడ్డి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచాలని, ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్ మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు కులగణన చేపట్టలేదని..ఎన్నికల హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంలేదని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పంచాయతీరాజ్, మున్సిప ల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శా తానికి పెంచాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాం ధీ బీసీలకు అనుకూలంగా మాట్లాడుతుంటే.. రేవంత్ ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్ల పెంపు పై మాట్లాడకుండా..బీసీలను అణచివేయాలని యత్నిస్తున్నదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో 214 జూనియర్ కాలేజీలు, 81 డిగ్రీ కాలేజీలు, 255 వృత్తి విద్యా కాలేజీలున్నాయని వాటిలో చదువుతున్న విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంజినీరింగ్ పూర్తైన విద్యార్థులకు కాలేజీల నిర్వాహకులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో 2022-23లో ఫీజు బకాయిలు రూ.73.80 కోట్లు, 2023-24 లో రూ.148 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందజేశారు.