రంగారెడ్డి, జనవరి 11 (నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్క పేదకు లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ఐటీ, శ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం రంగారెడ్డిజిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అధికారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల అమలుపై ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..లబ్ధిదారుల ఎంపికలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ప్రాతినిథ్యం వహిస్తున్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల సూచనలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
జనవరి 26 నుంచి అమలుచేసే రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలకు లబ్ధిదారుల ఎంపికచేయటంలో ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. ఈ నాలుగు పథకాల అమలుపై గ్రామస్థాయిలో, మున్సిపల్ స్థాయిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి లిస్టులను సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామసభలు నిర్వహించే ముందు ఆయా ప్రాంతాల్లో టాంటాం వేయించాలని తెలిపారు. వచ్చే ఉగాది నుంచి పౌరసరఫరాల దుకాణాల్లో సన్నబియ్యం ఇవ్వటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గ్రామస్థాయి, మున్సిపల్ స్థాయిలో పర్యటించే బృందాల్లో వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భూమిలేని కూలీ కుటుంబానికి రెండు విడుతలుగా రూ.12వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఇండ్లులేని నిరుపేద కుటుంబాలకు అవకాశమివ్వాలన్నారు. శాసనసభ్యులు సూచించిన విధంగా అర్బన్ ప్రాంతంలో లేదా రూరల్ ప్రాంతాల్లో గాని ప్రభుత్వ భూములున్నట్లయితే రెండో విడుతలో రాజీవ్ గృహం మాదిరిగా పది అంతస్తుల భవన సముదాయాలు నిర్మించి ఇండ్లులేని వారికి అందించటం జరుగుతుందన్నారు. అలాగే, రేషన్‌కార్డుల ఎంపికలో కూడా అర్హత కలిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు. అలాగే, వ్యవసాయానికి యోగ్యం కాని భూములను నిర్ధారించి, రాళ్లు రప్పలున్న భూములను గుర్తించి వ్యవసాయం సాగుచేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందే విధంగా చూడాలని మంత్రి సూచించారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన రంగారెడ్డిజిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ..ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఈనెల 11 నుంచి 13వరకు షెడ్యూల్ తయారు చేయటం జరిగిందన్నారు. అలాగే, 16 నుంచి 20వరకు ఆయాశాఖల బృందాలు లబ్ధిదారుల్లో అర్హులను గుర్తించి 21 నుంచి 24వరకు ఆయా గ్రామసభల్లో, మున్సిపల్ వార్డుల్లో లిస్టులు ఉంచటం జరుగుతుందన్నారు. రైతు భరోసాలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయ యోగ్యం భూములను గుర్తించాలని, కొత్త రేషన్‌కార్డుల ఎంపిక బృందాలు వెళ్లి నిజమైన అర్హులను ఎంపిక చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, ఆరికెపూడి గాందీ, ప్రకాశ్‌గౌడ్, ఈర్లపల్లి శంకర్, ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు కమిషనర్ కే. శశాంక్, మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్‌జైన్, రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.