బంజారాహిల్స్, అక్టోబర్ 25 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటో నడుపుతూ ఫొటోలకు పోజులివ్వడంపై అక్కడున్న ఆటోడ్రైవర్లు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రచారంలో భాగంగా శనివారం యూసుఫ్‌గూడకు వచ్చిన మంత్రికి అక్కడో ఆటో ఎదురైంది. వెంటనే ఆటోడ్రైవర్‌ను కిందకు దింపిన పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్‌తో కలిసి ఆటో ఎక్కి కొంతదూరం నడిపించారు. దీనిని కాంగ్రెస్ కార్యకర్తలు సంబురంగా చూశారు.
కానీ, పక్కనే ఉండి ఈ తతంగాన్ని గమనిస్తున్న కొందరు ఆటోడ్రైవర్లు ‘కాంగ్రెసోళ్లు ఆటోడ్రైవర్ల జీవితాలు ఆగం చేశా రు.. మహిళలకు బస్సు ఫ్రీ అంటూ చెప్పి మమ్మల్ని రోడ్డున పడేశారు.. ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదు. అసలే కోపంతో ఉన్న ఆటోడ్రైవర్లకు పుండుమీద కారం చల్లేలా మం త్రి ఇలా.. ఆటోను నడిపిస్తూ ప్రచారం చేయడం మరింత కోపం తెప్పించినట్టు ఉంది..’ అంటూ గొణుక్కోవడం కనిపించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన జాతీయ మీడియా ప్రతినిధి ఆటోడ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తారని మంత్రిని ప్రశ్నించగా త్వరలోనే ప్రారంభిస్తామం టూ అక్కడి నుంచి జారుకున్నారు.