రంగారెడ్డి, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి రోడ్డు సేప్టీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా సైబరాబాద్ ట్రాఫిక్ కమిషనర్, రాచకొండ ట్రాఫిక్ కమిషనర్, రోడ్స్ అండ్ బిల్డింగ్ అధికారులతో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు -2025, రోడ్డు సేప్టీ సంబందించిన వివిధ విషయాలపై సమీక్షించారు. ఆయాశాఖల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి ట్రాఫిక్ కమిషనర్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు-2025 ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మోటరు వాహనాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు నానాటికి అధికమవుతున్నాయన్నారు. వాహనాలు కండిషన్‌గా లేకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల బారినపడిన వారి కుటుంబ సభ్యులు అనాథలవుతున్నారన్నారు. అధికారులుగా మనం కలిసి విధులు నిర్వహిస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపడితే ప్రమాదాలను తగ్గించవచ్చునని అన్నారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా జనవరి 1 నుంచి 31వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో విద్యార్థులతో ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదాలతో అమూల్యమైన సందేశాన్నిచ్చి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కలిసి శ్రమిద్దామని తెలిపారు. ప్రతి మండలంలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాద స్థలానికి కమిటీలు చేరుకుని ప్రమాదానికి కారణమైన వివరాలను సేకరించి ప్రత్యామ్నాయ చర్యల కోసం ఉన్నతాధికారులకు తెలిపేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సంగీత, జడ్పీసీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్‌మోహన్, ట్రాఫిక్ అధికారులు, ఆర్టీసీ ఆర్ఎం, రోడ్స్ అండ్ బిల్డింగ్ అధికారులు పాల్గొన్నారు.