వికారాబాద్, జూలై 17, (నమస్తే తెలంగాణ): మూడు గంటల కరెంటుతో ఏ పంట పండించలేం.. ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అనుచితం.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు కర్షకుల మనుగడకు వ్యతిరేకంగా ఉన్నాయి..’ అంటూ రైతులోకం ధ్వజమెత్తింది. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు జరిగాయి. పలుచోట్ల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. కర్షకులపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టారు. ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అన్న రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఉచిత విద్యుత్ అనవసరమని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని నేడు పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతున్న పద్ధతిని చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఏజెంట్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ప్రజలతో చర్చించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాలు మరో తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు సరి పోతుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జిల్లా రైతాంగం గర్జించింది. ఉచిత విద్యుత్తుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు రైతు సమావేశాలను నిర్వ హించారు. సోమవారం జిల్లాలోని వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు రైతు వేది కల వద్ద నిర్వహించిన రైతు సమావేశాలకు జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా తరలి రావడంతోపా టు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అంతేకాకుండా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. కోట్‌పల్లి మండలంలోని రాంపూర్ రైతు వేదిక, మర్పల్లి మండలంలోని కల్కోడ రైతు వేదిక వద్ద నిర్వహించిన సమావేశాలకు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బొంరాస్‌పేట మండలంలోని రేగడిమైలారం, దుద్యాల మండలం పోలేపల్లి రైతువేదికల వద్ద నిర్వహించిన సమావేశాల్లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రైతులు తరిమికొట్టాలని, ఉచిత విద్యుత్ అవసరం లేదన్నందుకు వాతలు పెట్టాల ని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండగ అన్నారని, ఇప్పుడు రేవంత్ ఉచిత విద్యుత్తు అనవసరమని మాట్లాడుతూ రైతులను అవమానిన్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో వ్యవసాయం పండులా మారిందన్నారు. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి మనం ఎదుగడాన్ని ఓర్వలేకనే చంద్రబాబు ఏజెంట్ రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయని.. అందువల్ల మూడు పంటలు పండించే బీఆర్ఎస్ కావాలా, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేలు అన్నారు. మరోవైపు రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు మరో తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే.. ఏ పంటను కూడా పండించలేం. మూడు గంటల విద్యుత్తు చాలంటే ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. పచ్చని పంటలతో కళకళలాడుతున్న జిల్లాను ఎడారిగా మార్చడమే అవుతుందని రైతుసభల్లో రైతులు తేల్చి చెబుతున్నారు. 24 గంటల కరెంట్ లేకుండా ఎవుసాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లాలో రైతు సభలు ప్రారంభమయ్యాయి. షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతుసభలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్ పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని ఈ సందర్భంగా రైతు లు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తగా ఆలోచించి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని కొనియాడారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానించారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తొలిరోజు సభకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. ఇదే జోష్‌తో.. తొమ్మి ది రోజులపాటు జిల్లాలోని రైతువేదికల వద్ద నిర్వహించనున్న రైతు సభలను జయప్రదం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాయి.
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే మంచిరోజులు
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్తు ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రు. అంతేకాకుండా ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి షాపుల ఎదుట నిరీక్షించా ల్సి వచ్చేది. కానీ.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నదాతలకు మంచి రోజులొచ్చాయి. అదునుకు ముందే పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంటున్నారు. ఆ డబ్బులతో ఎరువులు, విత్తనాలకు సకాలంలో కొనుగోలు చేసి ఇంట్లో సిద్ధంగా ఉంచుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చీకటి రోజులే వస్తాయి. సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం.
– కుమ్మరి కిష్టయ్య, రైతు శ్రీనివాసులగూడ
మూడు పంటలు సాగు చేస్తున్నా..
నాకు 11 ఎకరాల భూమి ఉన్నది. అందులో కూరగాయలు, పసుపు, కంది తదితర పంటలను సాగు చేస్తు న్నా. బోరులో నీరు పుష్కలంగా ఉన్నది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిరంతర విద్యుత్తుతో ఏడాదికి మూడు పంటలను సాగు చేస్తున్నా. గతంలో కరెంట్ కోతలతో ఒక పంట కూడా సరిగ్గా పండేది కాదు. అప్పట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డా. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో వ్యవసా యం సాఫీగా సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– వెంకట్‌రెడ్డి , రైతు కల్కొడ, మర్పల్లి
కాంగ్రెస్ హయాంలో కరెంట్ పరిస్థితి దారుణం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు కరెంట్ వస్తుం దో.. పోతుందో తెలియక బోరుబావుల వద్దే నిరీక్షించాల్సి వచ్చేది. కానీ.. సీఎం కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత మాకు మంచిరోజులొచ్చాయి. కరెంట్ కష్టాల్లేవు. పంటల సాగుకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతున్నది. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.
–పాలకుర్ల సత్తయ్య గౌడ్, మాడ్గుల మండలం
ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే..
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి ఎం తో కృషి చేస్తున్నది. పంటల సాగుకు అప్పులు చేయొద్దనే ఉద్దేశంతో రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంటున్నది. 24 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేస్తూ వ్యవసాయాన్ని పండులా మార్చింది. గత 50 ఏండ్ల నుంచి ఎన్నో ప్రభుత్వాలను చూశా. వాటికంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనే చాలా బాగుంది. 24 గంటల విద్యుత్తుతో నాకున్న పది ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్నా. కాంగ్రెస్, బీజేపీలపై రైతులకు నమ్మకం లేదు. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. – బుగ్గ యాదయ్య, రైతు, బుగ్గోనిగూడ
ఉచిత కరెంట్ సరఫరా చాలా గొప్ప విషయం
నా వయస్సు 70 ఏండ్లు. నాకున్న 10 ఎకరాల భూమి లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నా. మా బావిలో పుష్కలంగా నీళ్లున్నాయి. గతం లో పంటలను సాగు చేసుకునేందుకు కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందుకు గురయ్యా. సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తుతో పంటలను సకాలంలో సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నా. ప్రభుత్వం అదునుకు అందిస్తున్న రైతుబంధు సాయంతో ఎరువులు, విత్తనాలను కొంటున్నా. రైతుల బాగు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా. -గోరేమియా, కల్కొడ, మర్పల్లి
రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి..
రేవంత్‌రెడ్డి.. వ్యవసాయమంటే తెలిసే మాట్లాడుతున్నావా, మూడు గంటల కరెంట్‌తో ఎంత భూమి పారుతుంది.. మూడు గంటల కరెంట్ ఇవ్వడమే మీ కాంగ్రెస్ పార్టీ విధానమైతే రైతులు మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే రైతులు నిన్ను తెలంగాణలో తిరగనివ్వరు.. మూడు గంటలు కరెంట్ చాలు అన్న మాటలను వెనక్కి తీసుకుని, రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
– అంజయ్య, రైతు, బుగ్గోనిగూడ