పెద్దఅంబర్‌పేట, ఫిబ్రవరి 10: ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసేందుకు మున్సిపల్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. వివరాల ఎడిట్ సమయంలో యాప్ ఇబ్బంది పెడుతున్నది. సర్వర్ డౌన్ కావడంతో తిరుగుతూనే ఉన్నదని, కనీసం గంటకు నాలుగు దరఖాస్తులను కూడా నమోదు చేయడం కావడంలేదని సిబ్బంది చెప్తున్నారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీవ్యాప్తంగా ఆరు గ్యారెంటీల కోసం దాదాపు 17 వేల దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తులను స్వయంగా స్వీకరించిన మున్సిపల్ సిబ్బంది.. ఆ తర్వాత ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. కానీ, దరఖాస్తుదారులు చేసిన అప్లికేషన్లలో, నమోదు సమయంలో దొర్లిన తప్పులు ఇప్పుడు తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో చేసుకున్న దరఖాస్తుల ఆన్లైన్ అనంతరం, వివరాలన్నింటినీ కలెక్టరేట్‌కు పంపించారు. అక్కడ గ్యాస్ ఏజెన్సీల నుంచి సేకరించిన వివరాలను, దరఖాస్తుదారులు చేసుకున్న గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన వివరాలతో పోల్చిచూడగా.. వేల సంఖ్యలో తప్పులు దొర్లినట్టు తేలింది.
అభయహస్తంలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500 కు ఇచ్చే గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు మున్సిపాలిటీలో దరఖాస్తులు స్వీకరించారు. ఆరు గ్యారెంటీల కోసం మున్సిపాలిటీలో దాదాపు 17 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం దరఖాస్తు చేసుకునే సమయంలో కన్జ్యుమర్ నంబర్‌ను నమోదు చేయాలని సూచించారు. కానీ, చాలామంది వేరే నంబర్‌ను నమోదుచేశారు. దీనికితోడు వివరాలను ఆన్లైన్ చేసే సమయంలోనూ కొన్ని తప్పులు దొర్లాయి. మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల నుంచి సేకరించిన సమాచారంతో దరఖాస్తు దారుల సమాచారాన్ని పోల్చి చూశారు. ఈ సమయంలో తప్పులు దొర్లినట్టు బయటపడింది. ఒక్క పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోనే 3,624 దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం నమోదైనట్టు తేల్చారు.
వాటిని సరిచేసి తిరిగి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండ్రోజులుగా మున్సిపల్ సిబ్బంది వీటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజాపాలన మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో సరైన సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. తప్పులు దొర్లిన దరఖాస్తుల్లోని చిరునామాల ఆధారంగా ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇండ్లకు తాళాలు ఉంటే ఫోన్లు చేసి గ్యాస్ కనెక్షన్, వినియోగదారుల నంబర్ ఇతర వివరాలు సేకరిస్తున్నారు. సేకరించడం ఒకత్తయితే.. వాటిని యాప్‌లో నమోదు చేయడం తలనొప్పిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా మార్పులు చేర్పులు ఉండటంతో సర్వర్ డౌన్‌గా ఉన్నదని, వివరాల నమోదు ఇబ్బందిగా మారిందని సిబ్బంది చెప్తున్నారు. ఒక్కో దరఖాస్తుదారు వివరాలు నమోదు చేసేందుకు దాదాపు 15 నిమిషాల వరకు పడుతున్నదని అంటున్నారు. ఈ ప్రక్రియతో మొబైల్ డాటా అయిపోతుంది కానీ, వివరాల నమోదు త్వరగా కావడం లేదని చెబుతున్నారు.