సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తేతెలంగాణ) ; ‘యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్లో పోనిచేద్దాం’ అని అనుకుంటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీసులు.. ఇక మీదట నిబంధనల విషయంలో కఠిన వైఖరి అవలంబించనున్నారు. ఇన్నాళ్లు నిబంధనలు బేఖాతరు చేసే వారిపై భారీ జరిమానాలు వేస్తున్నా.. వాహనదారుల్లో మార్పు రావడం లేదని భావించారేమో.. ఇప్పుడు ఏకంగా రాంగ్ రూట్లో వెళ్లేవారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ వారు ప్రమాదానికి కారకులైతే.. జైలు శిక్ష కూడా పడుతుందట. ‘వాహనదారులూ బీ అలర్ట్.. నిబంధనలు పాటిస్తూ.. ప్రయాణం చేయండి.. సురక్షితంగా గమ్యస్థానం చేరండ’ంటూ.. సూచిస్తున్నారు.
అవతలి రోడ్డుకు వెళ్లాలంటే లేదా ఆ రహదారిలోని పక్క సందులోకి వెళ్లాలంటే.. కనీసం 200 మీటర్ల దూరం వెళ్లి.. అక్కడ యూ టర్న్ తీసుకొని వెళ్లాలి. అంత దూరం వెళ్లడం అవసరమా.. ఎంచక్కా రాంగ్రూట్లో వెళ్తే క్షణాల్లో అనుకున్న చోటకు వెళ్లొచ్చని అనుకుంటున్నారా.. ఇక నుంచి అలా కుదరదు.. ఎందుకంటే..అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ తప్పదంటున్నారు పోలీసులు. ఇక నుంచి ఎవరైనా రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేస్తే వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. చార్జిషీట్ దాఖలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు..ఒకవేళ వారు ప్రమాదాలకు కారణమైతే..జైలు శిక్షకూడా పడుతుందంటున్నారు.
రోజూ సగటున 10 నుంచి 20 వరకు..
ప్రస్తుతం ట్రై కమిషనరేట్ల పరిధిలో ప్రతిరోజూ సగటున 10 నుంచి 20 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రతిరోజూ కనీసం ఒకరిద్దరు మృత్యువాత పడుతున్నారు. అయితే జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు.