Papireddyguda | కేశంపేట, ఏప్రిల్ 13 : గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీస్త్రీలు, బాలింతలకు విశిష్ఠ సేవలు అందజేస్తున్న అంగన్వాడీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం రూ.10లక్షలు మంజూరవగా జిల్లా పరిషత్ నుంచి పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో ప్రస్తుతం పనులు ముందుకు సాగడంలేదు. రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా పనులు ప్రారంభం కాకపోవడంపట్ల మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారినా తమ గ్రామ అంగన్వాడీ భవన రూపురేఖలు మాత్రం మారలేదని, ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
భవన నిర్మాణానికి గత ప్రభుత్వం కృషి
పాపిరెడ్డిగూడలో శిథిలమైన అంగన్వాడీ భవనం స్థానంలో శాశ్వత భవనం నిర్మించాలన్న ఉద్దేశ్యంతో గత ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షల నిధులను మంజూరు చేసింది. 10 ఫిబ్రవరి 2021న అప్పటి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, గత ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి అంగన్వాడీ భవన నిర్మాణానికిశంకు స్థాపన చేశారు. ప్రారంభంలో పనుల్లో పురోగతి కనిపించినా కొన్నాళ్లకు పనులు ముందుకు సాగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నికల హడావిడి, ప్రభుత్వం మారడం వంటి పరిణాలు వెనువెంటనే జరగడంతో నాలుగేళ్లుగా భవన నిర్మాణం అసంపూర్తిగానే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల గ్రామంలో గ్రంథాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను గ్రామస్తులు అంగన్వాడీ భవన నిర్మాణానికి కృషి చేయాలని కోరడంతో ఆయన రేపటి నుంచే పనులు ప్రారంభం అవుతాయని గ్రామస్తులకు భరోసా ఇచ్చారని, కానీ నేటి వరకు పనుల పురోగతిలో ఉలుకుపలుకు లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పాపిరెడ్డిగూడ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
పాడవుతున్న పదార్థాలు..
ప్రస్తుతం కొనసాగుతున్న అంగన్వాడీ భవనం పాడుబడి ఉండడంతో భవనంలో నిల్వ చేసిన ఆహార పదార్థాలు పాడవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. వర్షం వస్తే తుంపర, ఎండలకు వేడిగాలులవల్ల చిన్నారులు, గర్భిణీస్త్రీలు, బాలింతలకు వచ్చే ఆహార పదార్థాలను ఎలుకలు, పందికొక్కులు పాడుచేస్తున్నాయంటున్నారు. ఇక కొన్ని సమయాల్లో పాడుబడిన భవనంలోకి విష సర్పాలు వస్తున్నాయని చిన్నారులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేకు చెప్పినా ఫలితం లేదు
ప్రజాప్రతినిధుల పిల్లలు అంగన్వాడీలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా చట్టం చేయాలి. ప్రజాప్రతినిధుల ప్రభుత్వ పరమైన పాఠశాలల్లో చదవకపోవడంవల్లనే అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా మారిన భవనం విషయాన్ని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్లాను. అంగన్వాడీ భవనం విషయంలో పలుమార్లు వినతిపత్రం అందజేశాను. ఎమ్మెల్యేను కలిసినప్పుడు వారంరోజుల్లో పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. రెండు నెలలు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. ప్రజలచేత ఎన్నుకోవడిన నాయకుల పిల్లలను అంగన్వాడీలకు వచ్చేలా కఠినమైన ఆంక్షలు పెడితేనే అంగన్వాడీలు బాగుపడతాయి.
– రాఘవేందర్, పాపిరెడ్డిగూడ
విష సర్పాలు వస్తున్నాయి..
గ్రామంలోని నిర్మిస్తున్న అంగన్వాడీ భవన నిర్మాణం ముందుకు సాగకపోవడం వెనక కారణం ఏమిటని కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే నిధులు లేవని, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పనులు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అంగన్వాడీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. చిన్నారులు, ప్రమాదకరంగా ఉన్న అంగన్వాడీకి గర్భిణీ స్త్రీలు, బాలింతలు వెళ్లేందుకు భయపడుతున్నారు. శిథిలమైన అంగన్వాడీ భవనంలోకి విష సర్పాలు సైతం వస్తున్నాయి. పాలకులు, అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులు వెంటనే పనులు ప్రారంభిస్తే బాగుంటుంది.
– రామకృష్ణ, పాపిరెడ్డిగూడ