కొడంగల్, అక్టోబర్ 23 ; పచ్చని పంట పొలాలను కబళించేందుకు ఫార్మా కంపెనీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని దుద్యాల మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పంటలను పండించుకుంటున్న తమ భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. సెంటు భూమి కూడా కొనలేని స్థితిలో ఉన్న తమను అగాథంలోకి నెడుతున్నారని వాపోతున్నారు. ఫార్మా వద్దని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఇసుమంత కూడా పట్టించుకోవడంలేదన్నారు. డ్రోన్లతో సర్వేలు చేయిస్తున్నదని మండిపడుతున్నారు. ఉన్న భూమిని తాము వదులుకుంటే భార్యాబిడ్డలతో ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఏ పని చేసుకొని బతకాలో అర్థం కావడం లేదంటున్నారు. ప్రస్తుతం ఫార్మా ఉన్న ప్రాంతాల్లో కాలుష్యం విలయ తాండవం చేస్తున్నదన్నారు. ఇక్కడి పంట పొలాలకు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతలతో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు అన్నదాతల కడుపుకొట్టే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల మాదిరిగా భూములను కాపాడుకుంటూ వస్తున్నామని, నేడు అప్పనంగా భూములను కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. భూములు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లేందుకు సిద్ధమని రైతులు హెచ్చరిస్తున్నారు.
కొంపలు ముంచుతున్న అసైన్డ్ ల్యాండ్
దుద్యాల మండలం పోలెపల్లి, హకీంపేట, లగచర్ల ప్రాంతాల్లో అసైన్డ్ ల్యాండ్ కేవలం 252 ఎకరాలున్నదని, కానీ కొందరు దొంగదారుల్లో పట్టాలు సృష్టించుకోగా ప్రస్తుతం 500 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. అధికారులను ఒప్పించుకొని ఎవరికిష్టం వచ్చినట్లు వారు పట్టాలను సృష్టించుకున్నారని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. కబ్జాలో ఉన్న రైతులకు పట్టాలు లేవు కానీ కబ్జాలో లేని రైతులెందరికో ఈ ప్రాంతంలో భూములున్నాయన్నారు. ఫార్మాకు భూములిస్తున్నామని ముందుకు వచ్చేది ఈ నకిలీ రైతులేనని. అసలైన రైతులెవరు కూడా ఫార్మా కంపెనీలకు భూములిచ్చేందుకు సిద్ధంగా లేరని వెల్లడిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మొదటగా అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉన్నది, ఏవిధంగా రైతుల సంఖ్య పెరిగిందనే వాస్తవాలు బట్టబయలవుతాయని బాధిత రైతులు తెగేసి చెబుతున్నారు.
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు..
‘ఈ ప్రాంతంలో కనుచూపు మేర పట్టా ల్యాండ్లు ఉన్నాయి.. కొంతవరకు మాత్రమే అసైన్డ్ ల్యాండ్ ఉండి పట్టా భూములకు ఆనుకొని ఉండడంతో పట్టా భూములను ఫార్మా భూతం మింగే ప్రయత్నం కొనసాగుతున్నది..’ అని బాధిత రైతులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొంతమేర మాత్రమే గుట్ట ప్రాంతంగా ఉన్నదని, అయినప్పటికీ ఆ గుట్ట చుట్టూ పచ్చటి పొలాలే దర్శనమిస్తాయని అంటున్నారు. చెట్లను చూసి అధికారులు గుట్టలు అనుకొని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పచ్చటి పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం భావ్యం కాదన్నారు. ఇప్పుడిప్పుడే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటుంటే ఫార్మా భూతంతో కంటికి నిద్రలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాకు భూములనిచ్చే ప్రసక్తి లేదని, ప్రజా ప్రయోజనాలకు పనికివచ్చే కంపెనీల ఏర్పాటుకు స్వచ్ఛందంగా భూములు అప్పగించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
అన్నదాతలను మభ్యపెడుతున్న ప్రభుత్వం
ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూములు ఎకరాకు దాదాపు తొంభై లక్షల నుంచి కోటి విలువ పలుకుతున్నదని రైతులు చెబుతున్నారు. కాని ప్రభుత్వం కేవలం రూ.10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నదన్నారు. దీంతో భూములను వదులుకోవడానికి రైతులు సిద్ధంగా లేరన్నారు. అయితే ప్రభుత్వం అన్నదాతలను మభ్యపెట్టి స్వచ్ఛందంగా భూములు అందిస్తే రూ.10లక్షలతో పాటు 125 గజాల ఇంటి స్థలం, ఇంటికో ఉద్యోగం అని ఆశపెడుతున్నదని ఆరోపిస్తున్నారు. గ్రామాలవారీగా ఫార్మా బాధిత రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల సేకరణ చేపడుతుండడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
మొదటికే మోసం
హకీంపేట గ్రామంలో సుమారు 1600లకు పైగా జనాభాతోపాటు దాదాపు 1300 ఎకరాల సాగుభూములున్నాయి. ఈ ప్రాంతంలో కంది, వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, పెసర, వేరుశనగ, మామిడి, బత్తాయి, ఎర్రచంధనం వంటి పంటలను పుష్కలంగా పండించుకుంటున్నారు. సాధారణంగా అధిక మొత్తంలో వరి పంట సాగు ఉందని, బోర్ల ద్వారా పంటలను పండించుకొని ఆర్థికంగా లాభపడుతున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయితే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో ఓ వెలుగు వెలుగుతుందని అనుకుంటే, మొదటికే మోసం వచ్చేలా అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసైన్డ్ భూమి 252 ఎకరాలు.. పట్టాలు 500లకు పైగా..
హకీంపేట పరిధిలో అసైన్డ్ భూమి ఉన్నది 252 ఎకరాలు మాత్రమే కానీ పట్టాలు పొందిన ప్రకారం 500ల ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నకిలీ పట్టాదారులే అసలైన రైతుల కొంపలు ముంచుతున్నారు. కబ్జాలో ఉన్నవారికి పట్టాలు లేవు కానీ మిగతావారికి ఇష్టానుసారంగా అధికారులు పట్టాలు రాసి ఇచ్చారు. అధికారులు దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఈ విషయమై ఢిల్లీ వరకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. లేని అసైన్డ్ భూమిని చూసే ప్రభుత్వం ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు పూనుకున్నది. అసైన్డ్ భూమిపై పూర్తి విచారణ చేపడితే, నిజనిజాలు తేలుతాయి.
– కుమ్మరి శివకుమార్, ఫార్మా బాధిత రైతు,
హకీంపేట, దుద్యాల మండలంరైతులు చెప్పింది.. అధికారులు వినడంలేదు..
ఫార్మా కంపెనీ వద్దని రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం చెప్పిందే వినాలంటున్నారు. మాకున్న మూడు ఎకరాల పొలం ఫార్మాకు పోతే, మా బతుకు ఏ విధంగా కొనసాగించాలి. వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాం. మా నాన్న ఆర్మీలో ఉండి దేశానికి రక్షణగా ఉన్నారు. కానీ మా భూమిని మేము కాపాడుకోలేకపోతున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడ మానుకోవాలి. రైతు సంక్షేమాన్ని గుర్తించాలి.
– ప్రవీణ్‌కుమార్
ఎంతకైనా తెగిస్తాం..
మా ఎనిమిది మంది అన్నదమ్ముళ్లకు 32 ఎకరాలు ఉన్నది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూమిని లాక్కోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తుండు. సీఎం అవుతాడని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న పాపానికి మాకు ఈ దురదృష్టం పట్టింది. ప్రభుత్వమే ప్రజలను కాటేసేందుకు ప్రయత్నిస్తే మేం ఎవరికి చెప్పుకోవాలి. ఫార్మాకు మా భూములు ఇచ్చేది లేదు. ఎంతకైనా తెగిస్తాం. సమస్య పరిష్కరిస్తే సరి.. లేకపోతే చట్టపరంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం.
– దోరెమోని గోపాల్
డ్రోన్లతో సర్వేలు..
రైతులు భూములను అప్పగించకుండానే ప్రభుత్వం రైతు భూముల్లో డ్రోన్లతో సర్వేలు చేపడుతున్నది. డ్రోన్లను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అడ్డదారుల్లో భూములను లాక్కొనే యత్నం జరుగుతున్నది. పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేకుండా పోతున్నది. ఊహ తెలిసిన నాటి నుంచి భూమిపైనే ఆధారపడి, పంట సాగుతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఎవరినీ దూషించడంలేదు. అభివృద్ధిని అడ్డుకోవడంలేదు. మా రైతుల జోలికి రావద్దని మాత్రమే వేడుకుంటున్నాం. ప్రజా ప్రయోజనాలకు పనికి వచ్చే ఫ్యాక్టరీ, కంపెనీలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం.
– బాలకిష్టయ్య
ఒప్పుకొంటే పది లక్షలు.. లేకుంటే రూ.6లక్షలు
ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సమ్మతించి భూమిని అందిస్తే రూ.10లక్షలు ఇస్తారంట. లేదంటే రూ.6లక్షలు ఇచ్చి లాక్కొంటారంట. రూ.90లక్షల వరకు ధర పలుకుతున్న భూములను ప్రభుత్వం అప్పనంగా రూ.10లక్షలకు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నది. ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని ఆశ చూపుతుండ్రు. ఫార్మా కంపెనీ ఏర్పాటు కావడానికి చాలా సమయం పడుతుందని ప్రశ్నిస్తే.. మీకెందుకు మీరు భూమి ఇచ్చిన నాటి నుంచే మీకు ఉద్యోగం వచ్చి వేతనం అందుకుంటారని అధికారులు మాయమాటలు చెబుతుండ్రు. ఏర్పాటు కాని కంపెనీల్లో ఉద్యోగాలు ఏంటో.. వేతనం ఇవ్వడం ఏంటో.. అంతా అయోమయంగా ఉన్నది.
– దోరెమోని శివకుమార్