షాద్‌నగర్‌రూరల్, జనవరి 12 : సులభతరంగా, క్షేమంగా అందరికీ అందుబాటులో టికెట్ ధరలతో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పిన ఆర్టీసీ యంత్రాంగం పండుగ సమయాల్లో ప్రయాణికులపై అధిక భారం మోపుతున్నది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ నష్టాలబాటలో పయనిస్తున్నది.
ఆ నష్టాన్ని భర్తీ చేయాలనుకుందేమేగాని సంక్రాంతి పండుగ వేళ రెగ్యులర్ బస్సులకు సైతం ప్రత్యేక బస్సులంటూ స్టిక్కర్లను అంటించి ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ ప్రయాణికులు బస్సు కండక్టర్‌ను నిలదీస్తుండగా.. మీరు డిపోలో తెలుసుకోండి అంటూ తాపీగా సమాధానం ఇస్తున్నారంటూ ప్రయాణికులు వాపోతున్నారు. మహిళలు ఆర్టీసీలో అధిక సంఖ్యలో ప్రయాణిస్తుండడంతో కండక్టర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని మహిళా ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారు.
రోజూ నడిచే బస్సులతో పాటు పండుగ పర్వదినాల్లో ఆర్టీసీ యంత్రాంగం స్పెషల్ బస్సులను నడిపిస్తారు. కానీ ఈ సంక్రాంతి పర్వదినాన ప్రతి బస్సుకు స్పెషల్ స్టిక్కర్లను ఏర్పాటు చేసి అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇద్కెడి న్యాయమని ప్రశ్నిస్తే బస్సు దిగాలంటున్నారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్‌కు రూ.100 (రూ.30 అదనం)లను వసూలు చేయడం సరికాదు.
– మహబూబ్, ఆర్టీసీ ప్రయాణికుడు
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. రోజువారీ బస్సులతోపాటు 200 ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. దూరప్రాంతాల ప్రయాణికులను సైతం గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనపు బస్సులను నడుపుతున్నాం. ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో హైదరాబాద్ నుంచి రూ.30 అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా మరిన్ని అదనపు బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం.
– ఉష, ఆర్టీసీ డిపో డీఎం, షాద్‌నగర్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారితో ఆదివారం ఎంజీబీఎస్ కిటకిటలాడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సం క్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీలత వెల్లడించారు. రద్దీ దృష్ట్యా 14వతేదీ వరకు జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, సీబీఎస్, దిల్సుఖ్నగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.
– సుల్తాన్‌బజార్, జనవరి 12