బడంగ్‌పేట, డిసెంబర్ 24 : బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు లేకున్నా.. ముందస్తు పనులు ఎలా చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కమిషనర్ సరస్వతి, ఏఈ నర్సింహరాజు, వినీల్ గౌడ్‌ను ప్రశ్నించారు. 28వ డివిజన్ పరిధిలో ఉన్న సప్తగిరి కాలనీలో కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేసి.. సంవత్సరాలు గడిచి పోతున్నా ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి తీర్మానాలు, టెండర్లు లేకుండానే పనులు ఎలా చేయిస్తున్నారని కమిషనర్‌ను అడిగారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ పనులు చేస్తున్నారో కమిషనర్‌కు తెలియపోతే ఎలా అని నిలదీశారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు. గతంలో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి హెచ్ఎండీఏ నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. బడంగ్‌పేటకు రూ.50కోట్లు, మీర్‌పేట కు రూ.50కోట్లు, జల్పల్లికి రూ.25 కోట్లు, తుక్కుగూడకు రూ. 25 కోట్లు రోడ్ల కోసం కేటాయించినట్లు వెల్లడించారు.
గడిచిన సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంజూరు చేసిన ఎఫ్‌డీఎఫ్ నిధులను రద్దు చేయడం కాదు వెంటనే నిధులు ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించాలన్న చిత్త శుద్ధి ఉంటే నిధులు ఇవ్వాలన్నారు. గతంలో కేసీఆర్ అభివృద్ధి చేసిన పనులకు కాంగ్రెస్ సర్కారు ప్రారంభోత్సవాలు చేస్తున్నదని అన్నారు. గతంలో రోడ్ల కోసం రూ.1450 మంజూరు చేస్తే జీవో మార్చి శంకుస్థాపనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యంతరంగా ఆగి పోయిన ఇంటిగ్రేటెడ్ పనుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, యాతం పవన్ కుమార్, ఏనుగు రాంరెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.