వికారాబాద్, జూన్ 10, (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసరా పింఛన్‌దారులకు కష్టాలు మొదలయ్యాయి. ఆసరా పింఛన్‌తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ డబ్బుల కోసం ఆందోళన మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని పింఛన్‌దారులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా 20వ తేదీలోగా పింఛన్లను అందజేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడంతో పింఛన్‌దారుల్లో అయోమయం నెలకొన్నది.
ప్రతి నెలా పింఛన్ డబ్బుల కోసం కోసం ఎదురుచూడాల్సి వస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మిగతా నియోజకవర్గాలకు పింఛన్ డబ్బులు పంపిణీ ఆలస్యమైనప్పటికీ, సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి ప్రతీనెల పింఛన్ డబ్బులు ఆలస్యం కావడంపై జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. అంతేకాకుండా ప్రతి నెల 20వ తేది వరకు పింఛన్ డబ్బులను అందజేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆసరా పింఛన్‌దారులు కొనియాడుతూ గుర్తు చేసుకుంటున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గానికి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆసరా పింఛన్ల నిమిత్తం నిధులు మంజూరు అవుతుండగా, మిగతా వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లా నుంచి నిధులు మంజూరు చేస్తూ వస్తున్నారు.
ఆసరా పింఛన్‌తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఆందోళన మొదలైంది. ప్రతీ నెలా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతున్నది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని పింఛన్‌దారులకు పింఛన్ డబ్బుల పంపిణీ ప్రతి నెలా 29 లేదా 30 తేదీన ప్రారంభమై వారం రోజుల్లో అందజేస్తుండగా, కొడంగల్ నియోజకవర్గంలోని పింఛన్‌దారులు మాత్రం పింఛన్ డబ్బుల కోసం మొదటి వారం పూర్తయ్యే వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 20వ తేదిలోగా పింఛన్లను అందజేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడంతో పింఛన్‌దారుల్లో అయోమయం నెలకొన్నది. అయితే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులు ఇంకా అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత నెల పింఛన్ డబ్బులు ఈనెల మొదటి వారం వరకు అందిస్తు వస్తుండగా, ప్రస్తుతం మరింత ఆలస్యం కావడం గమనార్హం. అయితే జిల్లావ్యాప్తంగా 98,793 మంది పింఛన్‌దారులకు రూ.24.38 కోట్ల పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తావించడం మినహా మిగతా హామీలపై ఇప్పటివరకు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వెంటనే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ.2016 పింఛన్ డబ్బును రూ.4 వేలకు, దివ్యాంగులకు ఇచ్చే రూ.4016 పింఛన్ డబ్బులను రూ.6 వేలకు పెంచుతామని హామీనిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన ఆసరా పింఛన్‌దారులు పింఛన్ల పెంపు ఎప్పుడో అంటూ ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆరు గ్యారెంటీలంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ అమలుకు తెల్లరేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో పేద ప్రజలు ఎంతో మందికి పథకాల ఫలాలు అందడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. అదేవిధంగా పింఛన్ డబ్బులు పెంచుతామని హామీనిచ్చినప్పటికీ ఇంకా పాత పింఛన్లే ఇస్తుండడం గమనార్హం.