ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 18 : ఆన్లైన్ బెట్టింగ్ గేములాడి ఓ యువకుడు తన జీవితాన్ని చాలించాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని తులేకలాన్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తులేకలాన్ గ్రామానికి చెందిన చెనమోని శివలింగం(28) అనే యువకుడు ఇబ్రహీంపట్నంలోని ఐడీఎఫ్సీ ఫైనాన్స్‌లో పనిచేస్తున్నాడు.
కొంతకాలంగా అతడు ఆన్లైన్ బెట్టింగ్‌ల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురైన అతడు డిసెంబర్ 15న ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. శివలింగం మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.