నాడు గుక్కెడు నీటి కోసం జనం బిందెడు కష్టాలు పడేవారు. కిలోమీటర్ల మేర నడిచివెళ్లి బోర్లు, బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకునేవాళ్లు.. ఎప్పుడో ఒక్కసారి కాలనీలు, గ్రామాలకు వచ్చే నీటి ట్యాంకర్ కోసం పనులు మానుకొని ఎదురుచూడాల్సిన దుస్థితి. ఇక ఎండాకాలం వచ్చిందంటే నీటి కోసం యుద్ధాలే జరిగేవి. ప్రజలు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేసినా అప్పటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ స్వరాష్ట్రం సిద్ధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలోనే తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ‘జల’ కేతనాన్ని ఎగురవేసింది. ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టడంతోపాటు నడి ఎండాకాలంలోనూ పుష్కలంగా నీరు ఇంటింటికీ చేరాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు వెచ్చించి నీటి శుద్ధి పాంట్లు, పైపులైన్లు, గ్రామ గ్రామాన నీటి ట్యాంకులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా నేడు స్వచ్ఛమైన తాగునీరు నట్టింటికే వచ్చి చేరుతున్నది. రంగారెడ్డి జిల్లాలో రూ.898 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పనులు చేపట్టగా.. 1,072 ఆవాసాలకు సురక్షిత నీరు అందుతున్నది. అలాగే వికారాబాద్ జిల్లాలో రూ.1,483 కోట్లతో పనులు చేపట్టగా.. జిల్లావ్యాప్తంగా 1,98,162 కుటుంబాలకు నీరు అందుతున్నది.
-రంగారెడ్డి, జూన్ 17(నమస్తే తెలంగాణ)
ఒక్కరోజు రెండు రోజులు కాదు.. కొన్ని ఏండ్లుగా గుక్కెడు తాగినీటి కోసం జిల్లా ప్రజానీకం నానా తిప్పలు, అవస్థలు పడ్డారు. ఒక పూట భోజనం లేకున్నా మనుషులు ఉండొచ్చు, కానీ దాహం తీరకుండా జీవించడం చాలా కష్టం. అలాంటిది ప్రతీ వేసవిలో వికారాబాద్ జిల్లా ప్రజలు తాగునీటి కోసం ఎన్నో ఏండ్లుగా అల్లాడారు. తాగునీటి కోసం అలమటించారు. చేతిలో బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం ఇంటిల్లిపాదు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకున్నారు. ఊర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోర్లు, వాగుల్లోని చెలిమెలకు పోయి తాగునీరు తెచ్చుకునే దయనీయ పరిస్థితి నెలకొని ఉండేది. గుక్కెడు నీళ్లు తాగాలంటే అర్ధరాత్రి ఒంటిగంట వరకు గ్రామాల్లోని బోర్ల వద్ద పడిగాపులుకాయడంతోపాటు ఉదయం తెల్లవారు జామున లేవాల్సిన పరిస్థితి ఉండేది. పిల్ల, పితకా, ముసలి అని తేడా లేకుండా ఎవరి చేతనైన బిందెలతో వారు నీటి కోసం పరితపించేవారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో వేసవి వచ్చిందంటే నీటియుద్ధాలు జరుగుతుండేవి. గతంలోని పాలకులు ఏ ఒక్కరూ కూడా ప్రజల దాహార్తిని పట్టించుకున్నవారు లేరు. ప్రజల కన్నీటి కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరందించి జిల్లా ప్రజలకు అపర భగీరథుడయ్యారు. ఏటా వేసవిలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడం గుక్కెడు నీటికోసం కిలోమీటర్లమేర వెళ్లాల్సి వస్తదనుకున్న తరుణంలో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరందించారు. నేడు మంచినీళ్ల పండుగ సందర్భంగా ప్రత్యేక కథనం..
– వికారాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ)
మిషన్ భగీరధ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తాగునీరందుతున్నది. 230 కిలోమీటర్ల దూరంలోని కొల్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ జిల్లాలోని రాఘవాపూర్, కొడంగల్‌లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సరఫరా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మిషన్ భగీరథ పనుల్లో భాగంగా రూ.1070 కోట్లతో ప్రధాన పైప్లైన్లు, ఓహెచ్బీఆర్ల నిర్మాణం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, రూ.413 కోట్లతో ఇంట్రా విలేజ్ పనులను చేశారు. అయితే జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని 1,98,162 కుటుంబాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా భగీరధ నీరు సరఫరా జరుగుతుంది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా తాగునీటిని అందించేందుకుగాను 1920 కిలోమీటర్ల పైప్‌లైన్, 874 ఓహెచ్ఎస్ఆర్ల నిర్మించారు.
జిల్లాలోని 971 ఆవాసాలకు నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 2017-19 వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండడంతో 2019 వేసవిలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో తీవ్ర తాగునీటి సమస్య ఎదుర్కోక తప్పదని అందరూ అనుకున్నారు. కానీ, మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేయడంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రతీ వేసవిలో తాగునీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లి బోర్లు, బావుల వద్ద తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. గతంలోని ఏ ప్రభుత్వమూ, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఆలోచనను సీఎం కేసీఆర్ ఆలోచించి రూ.కోట్లు ఖర్చు చేసి ఎక్కడో ఉన్న శ్రీశైలం నుంచి తాగునీటిని తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చారు. గతంలో స్థానికంగా ఉన్న చెరువులు, బోర్లు, బావుల ద్వారా తాగునీటిని తెచ్చుకునేవారు. మిషన్ భగీరథతో జిల్లా ప్రజల దాహార్తిని బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని జిల్లాలోని సబ్బండ వర్ణాల ప్రజలు సీఎం కేసీఆర్‌కు జైకొడుతున్నారు. పరిగి సమీపంలోని రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లోని ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
‘గుక్కెడు నీటి కోసం బోర్లు, బావుల వద్దకు పరుగులు.. ఖాళీ బిందెలతో తప్పని జాగారం.. ఇక నీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు కోకొల్లలు. రక్షిత నీటి మాట దేవుడెరుగు.. తాగేందుకు గుక్కెడు నీరు కరువై.. ఫ్లోరైడ్ నీటినే తాగి మూడు పదుల వయసుకే ఆరు పదుల వయసు పైబడి జీవచ్చవాలుగా బతుకులు వెళ్లదీసిన దుర్భర పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో ఉన్న పరిస్థితులు ఇవి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలోనే తాగు నీటి సమస్యకు పరిష్కారం చూపి ‘జల’ కేతనాన్ని ఎగురవేసింది. ఫ్లోరైడ్ భూతానికి చరమగీతం పాడింది. మిషన్ భగీరథ పథకానికి రూ.898కోట్లను వెచ్చించి 1,072 ఆవాసాలకు శుద్ద జలాలను గడపగడపకు అందిస్తోంది. సీఎం కేసీఆర్ సంకల్ప సిద్దితో ప్రతి ఆవాసానికి తాగునీరు అందుతున్నది. కొండలు, గుట్టలు ఎక్కిన భగీరథ జలం మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల క‘న్నీటి’ కష్టాలను తీర్చింది. ఫలితంగా జిల్లాలోని ఆడబిడ్డల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.’
– రంగారెడ్డి , జూన్ 17 (నమస్తే తెలంగాణ)
1,072 ఆవాసాల్లో గడపగడపకూ మంచినీరు..
‘మిషన్ భగీరథ’ నీళ్లు దాహార్తితోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని సైతం ప్రసాదిస్తున్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నీటిని ఎల్లోర్ రిజర్వాయర్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు తరలిస్తున్నారు. ముచ్చెర్ల, అంతారం, కమ్మదనం, కల్వకుర్తి వాటర్ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసి జిల్లాలోని 1,072 ఆవాసాలకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం 850 ట్యాంకులను నిర్మించి 3,236 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టింది. గడపగడపకూ నీరందించే ఉద్దేశంతో 2,94,705 నల్లా కనెక్షన్లను సైతం ఇచ్చింది. అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో రూ.362 కోట్లతో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.213కోట్లతో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రూ.323కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనులను విజయవంతంగా చేపట్టింది. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్ రక్కసిని తరిమేసింది. భూగర్భ జలాలు అడుగంటి బోరు, బావులు, ట్యాంకర్లతో సరఫరా అయిన నీటిని తాగి ఇబ్బందులు పడ్డారు. మిషన్ భగీరథ నీళ్లొచ్చాక సమస్యల నుంచి విముక్తి పొందారు. గిరిజనుల ఇంటి ముంగిటకే శుద్ధ జలాలు చేరి ఏండ్లనాటి వారి కష్టాలను తీర్చాయి.
చెలిమె నీటి నుంచి విముక్తి..
రంగారెడ్డి-నల్గొండ జిల్లాల సరిహద్దులోని మంచాల మండలంలో పటేల్చెర్వుతండా ఉన్నది. ఆరుట్ల గ్రామానికి సుమారు ఐదుకిలోమీటర్ల దూరంలో రాచకొండ గుట్టల్లో ఈ తండా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ తండాలో తాగునీరు దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఈ తండావాసులు గ్రామ సమీపంలో ఉన్న చెలిమె నుంచి చెరువు నుంచి తాగునీరు తెచ్చుకునేవారు. ఈ చెరువు ఎండిపోతే వ్యవసాయ పొలాల వద్ద కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకునేవారు. అదీ..లేనిపక్షంలో సమీప గుట్టల్లోని దోనల్లో తాగునీటిని తెచ్చుకునేవారు. ఎండాకాలంలోనూ ఇక్కడి వాసుల బాధలు వర్ణణాతీతం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు. అందులో పటేల్చెర్వుతండా కూడా ఒకటి. ఈ తండాలోనూ ప్రత్యేకించి మిషన్ భగీరథ ద్వారా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును నిర్మించారు. ఆరుట్ల నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును నింపుతున్నారు. ఈ ట్యాంకు ద్వారా ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయమే తాగునీరు అందుతుండడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 300 వరకు ఇండ్లు ఉన్నాయి.
నాడు…
ట్యాంకర్ వద్ద నీటి కోసం గోస పడుతున్న ఈ దృశ్యం నల్లగొండ- యాచారం జిల్లా సరిహద్దున ఉన్న యాచారం మండలంలోని మంతన్ గౌరెల్లి గ్రామంలోనిది. 3,500 పై చిలుకు జనాభా ఉన్న ఈ గ్రామంలో 80 శాతానికి పైగా గిరిజనులే నివాసం ఉంటున్నారు. తాగేందుకు దొరికిన గుక్కెడు నీరు సైతం ఫ్లోరైడ్‌తో కూడుకుని ఉండడంతో వాటర్ ట్యాంక్ నీటిపైనే ఇక్కడి ప్రజానీకం ఆధారపడేది. ఈ విషపు నీటిని తాగి అంగవైకల్యం పొందినవారూ గ్రామంలో కోకొల్లలు.
నేడు..
మిషన్ భగీరథ పథకంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామంలోని 678 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి మిషన్ భగీరథ నీటిని అందించడం ద్వారా నీటి కష్టాలను తీర్చింది. ఇందుకుగాను మూడు ట్యాంకులను కూడా ప్రభుత్వం నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధ జలాలను అందిస్తుండడంతో విషపు నీటిని తాగే పరిస్థితుల నుంచి స్థానికులు విముక్తి పొందారు. నిరాటంకంగా సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీళ్లతో దాహార్తిని తీర్చుకుంటున్నారు.