సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో జూన్నెలలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతంతో పోలిస్తే సుమారుగా 15శాతానికిపైగా వినియోగంతో పాటు డిమాండ్ పెరిగింది. ఇందుకు కారణం ఎల్నినో ప్రభావమేనని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తాము వేసిన అంచనాలను తారుమారు చేస్తూ ఈ సంవత్సరం జూన్నెలలో డిమాండ్ పెరిగిందని వారు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్నెలలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి సరికొత్త రికార్డు నమోదైంది.
జూన్లో ఎండలు విపరీతంగా కొట్టడం, ఎల్నినోతో అంతంతమాత్రంగానే వర్షాలు పడడంతో విద్యుత్ వాడకం పెరిగింది. ఇళ్లల్లో, వ్యాపారసంస్థల్లో ఏసీలు, కూలర్ల వాడకం వేసవి మాదిరిగానే కొనసాగడంతో ఈ సంవత్సరం జూన్ నెలలో జీహెచ్ఎంసీ పరిధిలో 2540 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం నమోదైంది. ఈవినియోగం 2024 జూన్లో 2127 మిలియన్ యూనిట్లు కాగా 2025 జూన్ 2150 మిలియన్ యూనిట్లుగా రికార్డులు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జూన్ 3న ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో 4471 మెగావాట్ల గరిష్ట లోడ్ నమోదైంది.
సాధారణంగా జూన్ రెండోవారం నుంచే నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవాలి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. కేవలం జూన్లో మూడు,నాలుగుసార్లు మాత్రమే వర్షం కురిసింది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఒకవైపు చల్లగా ఉంటూనే ఉక్కపోత కారణంగా విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగింది. ఎల్నినో కారణంగా పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవడంతో రాత్రి వేళల్లో సైతం ఉక్కపోత తీవ్రంగా ఉండి ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. జూన్ చివరివారం నుంచి జూలై 2వ తేదీ వరకు విద్యుత్ వినియోగంతో పాటు డిమాండ్ కూడా గతం కంటే ఎక్కువగానే నమోదవుతోంది. గత సంవత్సరం జూన్లో 66 మిలియన్ యూనిట్ల దరిదాపుల్లో విద్యుత్ వినియోగం ఉండగా ఈసారి దాదాపు 80 మిలియన్ యూనిట్లకు చేరింది.