రఘునాథపాలెం, ఆగస్టు 9: వ్యవసాయ పనులు చేస్తున్న ఓ రైతు గుండెపోటుతో చేనులోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిమ్మపూడి గ్రామానికి చెందిన కటకం వెంకన్న (48) తనకు సొంతంగా ఉన్న 30 కుంటలకుతోడు మరో తొమ్మిది ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి, వరి సాగు చేస్తున్నాడు.
రోజు మాదిరిగానే ఆదివారం భార్య రజితతోపాటు కూలీలతో చేలో పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకన్న ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. అప్పటివరకు తమతో సంతోషంగా ఉన్న వెంకన్న ఆకస్మిక మృతి చెందడంతో కుటుంబసభ్యులు, కూలీలు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
వెంకన్న మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ వైస్ ఎంపీపీ గుత్తా రవి వెంకన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళి అర్పించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు గంగిరెడ్డి విజయ్‌రెడ్డి, ఉపేందర్, మద్దుల నాగేశ్వరరావు, దొంతు సత్యనారాయణ, కాళంగి వీరబాబు, గుండ్ల ముత్తయ్య, పోతురాజు రమేశ్, పోతురాజు ఉపేందర్ తదితరులు ఉన్నారు.