Namitha | ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటి నమిత.. ప్రస్తుతం తన సినిమాల కంటే ఇంటర్వ్యూల్లో చేస్తున్న వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వివాహ వ్యవస్థ, మహిళలపై అమలయ్యే సంప్రదాయాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత పాటించాల్సిన కొన్ని సంప్రదాయాలు, నిబంధనలు కేవలం మహిళలకే ఎందుకు వర్తించాలంటూ నమిత ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను కలిపే బంధమని, అలాంటప్పుడు పెళ్లికి సంబంధించిన నియమాలు, బాధ్యతలు కూడా ఇద్దరికీ సమానంగా ఉండాలని నమిత అభిప్రాయపడింది. అయితే మన సమాజంలో కొన్ని సంప్రదాయాలు, ఆంక్షలు మాత్రం ప్రధానంగా మహిళలపైనే ఉండటంపై ఆమె ప్రశ్నలు సంధించింది.
ముఖ్యంగా పెళ్లి తర్వాత మహిళలు ఎలా ఉండాలి, ఏం ధరించాలి, ఏ సంప్రదాయాలను పాటించాలి అనే విషయంలో ఎన్నో నియమాలు ఉంటాయని.. అదే సమయంలో పురుషులకు మాత్రం ఇలాంటి నిబంధనలు చాలా తక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. ఈ విషయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.నమిత చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా తాళి బొట్టు గురించి ప్రస్తావన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వివాహానికి గుర్తుగా మహిళలు మాత్రమే తాళి ఎందుకు ధరించాలి? పురుషులు కూడా పెళ్లయిందని తెలియజేసే ఏదైనా గుర్తును ఎందుకు ధరించకూడదు? అంటూ ఆమె ప్రశ్నించింది.
వివాహం ఇద్దరు వ్యక్తుల సమాన భాగస్వామ్యంతో సాగుతుందన్నప్పుడు.. వివాహానికి సంబంధించిన గుర్తింపు కూడా ఇద్దరికీ ఉండాలని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కేవలం సంప్రదాయం పేరుతో మహిళలపైనే కొన్ని నిబంధనలను రుద్దడం సరికాదనే ఉద్దేశాన్ని నమిత వ్యక్తం చేసింది.నమిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె చెప్పిన అంశాన్ని సమర్థిస్తున్నారు. కాలం మారుతున్నప్పుడు సంప్రదాయాలను కూడా కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉందని, భార్యాభర్తలిద్దరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు కొందరు మాత్రం నమిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను అర్థం చేసుకోకుండా వాటిని ప్రశ్నించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.