కోల్కతా, సెప్టెంబర్ 26: ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి, బీజేపీని బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో గెలిపించడానికే ఎన్నికల సంఘం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించిందని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మైనారిటీల ప్రాబల్యం ఉన్న రిజీనగర్ ఉప ఎన్నికకు అధికార బీజేపీ తరపున పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా కోల్కతా వెలుపల హుగ్లీలోని సెరమ్పూర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఈసీని బీజేపీ ఎలా దుర్వినియోగం చేసిందనే నిజం ఇప్పుడు బయటపడిందన్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయన్నారు. సర్ పేరిట బెంగాల్లో 93 లక్షల ఓట్లను తొలగించారని ఆమె విమర్శించారు.