తాండూరు, జూలై 12 : కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలందరికీ కష్టాలు తప్పడం లేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై కంట్రోల్ ఎక్కడని నిలదీశారు. ఒక వైపు కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం పరిపాలన వైఫల్యాన్ని వేలెత్తి చూపుతున్నదన్నారు. మరో వైపు తరలిపోతున్న పెట్టుబడుల పర్వంతో యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదన్నారు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే గడియ గడియకు పవర్ కట్ ఏమిటని ప్రశ్నించారు.
మెగా డీఎస్సీ వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పడు నోరు మెదపకపోవడం ఏమిటన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇదేనా కాంగ్రెస్ తెస్తానన్న మార్పు అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దేందుకు పదేండ్లు కష్టపడి పునాదులు వేస్తే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ ఆగమయ్యే రోజులొస్తున్నాయని మండిపడ్డారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కార్ మేల్కొనకపోతే రాష్ట్రంతో పాటు దేశానికి కూడా నష్టమేనన్నారు. బీఆర్ఎస్ నిరుద్యోగులకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాండూరులో అక్రమాల జోరు నడుస్తున్నదన్నారు. దళారులు రాజ్యమేలడంతో ఎంతో మంది సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అక్రమంగా ఇసుక, సుద్ద, ఎర్రమట్టి, నాపరాతి తరలిస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే సన్నిహితులు అక్రమ వ్యాపారాలు జోరుగా చేస్తున్నారని విమర్శించారు.
చిన్నపాటి వర్షానికే తాండూరు పట్టణంలోని కొన్ని కాలనీలు నీట మునుగుతున్నప్పటికీ చిలుక వాగుపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడం లేదన్నారు. చిలుక వాగు నాలా విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. గతంలో తాము తీసుకొచ్చిన అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజా ఉద్యమం చేస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన కట్టడాలకు శంకుస్థాపనలు చేసి సంతోష పడుతున్నారని, కొత్త నిధులేమీ లేవన్నారు.
అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. పార్టీ నేతలతో పాటు తాండూరు ప్రజలనూ ఇబ్బందులకు గురి చేస్తే రాబోవు రోజుల్లో సరైన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం 5 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించి.. పదవీ బాధ్యతలు ముగిసిన ప్రజాప్రతినిధులను మాజీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. వచ్చే ఎన్నికల్లో ఊరూరా బీఆర్ఎస్ జెండా ఎగురవేద్దామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు శ్రీశైల్‌రెడ్డి, రాజుగౌడ్, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌చారి, రవిందర్‌రెడ్డి, నయీం, వీరేందర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.