వికారాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై నిరసనలు, నిలదీతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో వ్యవహరించిన తీరుపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
పై నాలుగు పథకాలకు సంబంధించి ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహిం చి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, ఈనెల 26న వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అర్హులు చాలామంది ఉండడంతో కొంతమందికే లబ్ధి చేకూర్చేలా యత్నించగా.. గ్రామ, వార్డు సభల్లో ప్రజలు తమకూ వర్తింపజేయాలని డిమాండ్ చేయడంతోపాటు అధికారులను నిలదీస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల విషయంలోనూ అర్హుల్లో సగం మందిని కూడా ఎంపిక చేయకపోవడంతో వారి నుంచీ నిలదీతలు, నిరసనలు వ్యక్తం అవుతుండడంతో దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించారు.
కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లావ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. రెండు రోజుల్లోనే 28,189 అప్లికేషన్లు రాగా.. నేటితో గ్రామ, వార్డు సభలు ముగియనున్న దృష్ట్యా వాటి సంఖ్య 50,000 దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కేవలం 23,000 మందికే కొత్త కార్డులను జారీ చేసి చేతులు దులుపుకొందామనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు షాకిచ్చారు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోగా కొద్ది మందినే ఎంపి క చేశారని మండిపడుతున్నారు. జిల్లాలో దాదాపు గా లక్ష మంది వరకు వాటి కోసం నిరీక్షిస్తున్నారు.
ప్రతి గ్రామంలోనూ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే వారి సంఖ్య వందకుపైగా ఉన్నా కేవ లం కొంతమందిని మాత్రమే అర్హుల జాబితాలో పొందుపర్చడం గమనార్హం. ప్రజాపాలన సమయంలో రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలు సర్వే సమయంలో కనిపించకపోవడంతో.. ఇండ్లకు వచ్చి సర్వే చేస్తున్న అధికారులను స్థానికులు నిలదీస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అప్రమత్తమైన జిల్లా యం త్రాంగం రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ పత్రిక ప్రకటన విడుదల చేసి దాటవేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇది కోత విధించడంలో భాగంగానే సగం మందిని దరఖాస్తు చేసుకున్న జాబితాలో లేకుండా చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి.