బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Oct 17, 2020 , 00:28:06

పంటలకు పరిహారం అందేలా చూస్తాం

పంటలకు పరిహారం అందేలా చూస్తాం

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు

పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 

పరిగి/ పూడూరు/ దోమ: వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను సర్కారు ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని సయ్యద్‌ మల్కాపూర్‌, సాలిప్పలబాటతండా, గడిసింగాపూర్‌, పూడూరు మండలం దేవనోనిగూడ, దోమ మండలం బుద్లాపూర్‌ గ్రామాల్లో దెబ్బతిన్న వరి, పత్తి పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు పరిగి నియోజకవర్గంలో సుమారు 2వేల పై చిలుకు ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రతి గ్రామంలో ఏఈవోలు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతారన్నారు. పంట నష్టంతో ఇబ్బందులు పడుతున్న రైతులను సర్కారు ఆదుకునేలా కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్ధేశంతోనే రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నారని అన్నారు. యాసంగిలో వలె ఈసారి కూడా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నదన్నారు. వరి, పత్తి పంటలను ఎమ్మెల్యే పరిశీలించి జరిగిన నష్టం రైతులను అడిగి తెలుసుకున్నారు. గడిసింగాపూర్‌లో చెరువు నిండితే కాలువ వల్ల నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమాలలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, దోమ, పరిగి జడ్పీటీసీలు నాగారెడ్డి, హరిప్రియ, ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, మార్కెట్‌ చైర్మన్‌ అజహరుద్దీన్‌, పరిగి పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్లు మేడిద రాజేందర్‌, రాజేందర్‌రెడ్డి, ఏడీఏ వీరప్ప, వ్యవసాయాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆయా మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌.భాస్కర్‌, ఎ.గోపాల్‌, శ్రీనివాస్‌, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.