తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ఎంతో మందికి చూపును ప్రసాదిస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలో 15,670 మందికి కంటి పరీక్షలు చేయగా, 1,303 మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. 1,201 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. వికారాబాద్ జిల్లాలో 5265 మందికి కంటి పరీక్షలు చేయగా, 870 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. 772 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కంటి సమస్యలు అధికంగా ఉన్నవారిని ఆపరేషన్ నిమిత్తం రెఫర్ చేశారు. ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, అద్దాలను అందిస్తుండడంతో పాటు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
– షాబాద్, మార్చి 9
షాబాద్, మార్చి 9 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 15,670 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,303 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,201 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
203 గ్రామాలు, 44 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చినవారికి వికారాబాద్ జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు చేస్తున్నాయి. 5265 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. 870 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. 772 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 203 గ్రామాలు, 44 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.