వికారాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఆనవాళ్లు లేకుండా చేస్తున్న రేవంత్ సర్కార్ తెలంగాణకు హరితహారం కార్యక్రమ పేరును వనమహోత్సవంగా మార్చడంతోపాటు ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలో నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని కూడా భారీగా తగ్గించింది. గతేడాదితో పో లిస్తే ఈ ఏడాది సుమారు 10 లక్షల మొక్కల మేర లక్ష్యాన్ని తగ్గించడం గమనార్హం. మొదట ఈ ఏడాది 40.53 లక్షల మొక్కలను నాటాలని జిల్లా అటవీశాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించగా ప్రభుత్వ ఆదేశాల మేరకు టార్గెట్ తగ్గినట్లు సమాచా రం. పచ్చదనం పెంపే లక్ష్యంగా అమలు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంపై శీతకన్ను చూపడంపై జిల్లా అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వం మొక్కలను నాటడంతోపాటు సంరక్షణకు చర్యలు తీసుకోవడం, జియో ట్యాగింగ్ ప్ర క్రియ చేపట్టగా ఈ ఏడాది జియో ట్యాగింగ్ ప్రక్రియతోపాటు మొక్కల సంరక్షణకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అయితే 2024-25 ఆర్థి క సంవత్సరానికి 29.33 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, గతేడాది 40.49 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుని 39.69 లక్షల మొక్కలను నాటారు. జిల్లాలోని 580 నర్సరీల్లో మొ క్కలను పెంచి ప్రోగ్రామ్‌కు సిద్ధం చేస్తున్నారు.
2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో వికారాబాద్ జిల్లాలో పచ్చదనం పెంపొందింది. ఏ గ్రా మం, పల్లె చూసినా పచ్చదనంతో కళకళలాడుతున్నది. ఈ కార్యక్రమ ప్రారంభానికి ముందు జిల్లాలో 22శాతంగా ఉన్న పచ్చదనం ఎనిమిదేండ్లలో 26 శాతం మేర పెరిగినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గ్రీనరీని పెంచేందుకు ప్రతి ఏటా అటవీ, గ్రామీణాభివృద్ధితోసహా పలు శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. అంతేకాకుండా కొన్ని అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సీడ్‌బాల్స్ కూడా వేశారు. అటవీ ప్రాంతాల్లో ఉండే మొక్కలతోపాటు ఔష ధ మొక్కలనూ జిల్లా అటవీశాఖ యంత్రాంగం నాటింది. హరితహారం కార్యక్రమం తో పెరిగిన గ్రీనరీతో వర్షాలు కూడా సమృద్ధిగా కురిశాయి. అయితే జిల్లాలో తెలంగాణకు హరితహారంలో భాగంగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17లో 1.39 కోట్ల మొక్కలు, 2017-18లో 71.04 లక్షలు, 2018-19లో 86.12 లక్షలు, 2019-20లో 1.02 కోట్లు, 2021-22లో 74 లక్షలు, 2022-23లో 40.25 లక్షలు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 39.60 లక్షల మొక్కలను జిల్లాలో నాటారు.
వనమహోత్సవంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సర ంలో 29.33 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్న ది. అయితే శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాన్ని పరిశీలిస్తే.. విద్యాశాఖ-11,000, పశుసంవర్ధకశాఖ-5,000, ఉద్యానవనశాఖ 2,00000, పరిశ్రమలశాఖ- 10,000, అటవీ శాఖ 3,50,000, డీపీవో-డీఆర్డీవో ఆధ్వర్యంలో 18,00,000, గనుల శాఖ 50,000, పౌరసరఫరాల శాఖ-2,000, ఎక్సైజ్ శాఖ-15,000, వ్యవసాయశాఖ 2,50,000, మార్కెటింగ్‌శాఖ-500, పోలీస్ శాఖ 10,000, నీటిపారుదలశాఖ 5,000, రోడ్లు, భవనాల శాఖ 500, జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో 1000, తాండూరు మున్సిపాలిటీలో 60,000, వికారాబాద్ మున్సిపాలిటీలో 70 ,000, కొడంగల్ మున్సిపాలిటీలో 50,000, పరిగి మున్సిపాలిటీలో 43,000 మొక్కలను నాటాలని టార్గెట్‌గా పెట్టారు. అదేవిధంగా వనమహోత్సవంలో భాగంగా టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, మునగ, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. అయితే ఇప్పటికే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. అయితే గ్రామా ల్లో జామ, కరివేపాకు, దానిమ్మ, గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు వివి ధ రకాల మొక్కలను నాటనున్నారు. ఈ ఏడాది జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సా రించారు. అనంతగిరి అటవీ ప్రాంతంతోపాటు మిగతా అన్ని అటవీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఔషధ మొక్కలను నాటనున్నారు. అయితే అటవీ శాఖ 14 నర్సరీల్లో 6,74,964 మొక్కలను సిద్ధం చేస్తున్నది.