రంగారెడ్డి, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ఓటరు నమోదులో భాగంగా జిల్లాలో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌కు విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3,369 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు. జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకున్నారు.
ఓటు హక్కు కోసం 1,871 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓట్ల తొలగింపునకు 808 మంది, చిరునామా మార్పు, వివరాల సవరణకు 1,227 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేక క్యాంపుల నిర్వహణలో 3,369 మంది బీఎల్వోలు పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. స్పెషల్ డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్ శశాంకతోపాటు ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, డీఈవోలు పర్యవేక్షించారు.