రంగారెడ్డిజిల్లాలో ఓవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి రైతులకు శాపంగా మారింది. పంట చేతికందే సమయంలో వర్షాలు లేక పలు మండలాల్లో వరిపంట ఎండిపోయి రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. తీరా పంట చేతికందే సమయంలో అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతున్నది. జిల్లాలో వరికోతలు ప్రారంభమైనప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. వరి కోతలు కోసి రైతులు కల్లాల వద్దే వడ్లు నిల్వ ఉంచారు. మరికొంతమంది రైతులు రోడ్లపై ఆరబోసారు. ఈ పరిస్థితిలో రెండు మూడు రోజులుగా అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతున్నది. వరి కోతలు ప్రారంభమైన వెంటనే కొనుగోలు కేంద్రాలుంటే ఈ అవస్థలు తప్పేవని రైతులు వాపోతున్నారు. వరికోతలు ప్రారంభమైనందున వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ)/షాబాద్
జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం ధాన్యం కొనుగోళ్ల ఊసెత్తడంలేదు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉండగా, ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం.. మద్దతు ధర ప్రకటించకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన నెలకొన్నది. అసలు ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చేస్తుందా..? లేదా అన్న సందేహం రైతుల్లో వ్యక్తమవుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బిడ్డగా కేసీఆర్ యాసంగి, వానకాలం సీజన్లలో పంటల కోత సమయానికి ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మద్దతు ధర ప్రకటించి రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టేవారు. కాని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ ఏడాది యాసంగి సీజన్లో భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లల్లో నీటిమట్టం తగ్గిపోయి జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరిపంటలు ఎండిపోగా.. కొన్ని ప్రాంతాల్లో పంటలను పశువులకు మేతగా వేశారు. బోర్లు పోసిన కొద్దిపాటి నీటికి పంటలు పండించి గట్టెక్కిన రైతులకు ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమైనా సర్కారు ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా నుంచి ఈ యాసంగి సీజన్లో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుమతి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 95 వేల ఎకరాల్లో యాసంగిలో వరి పంట సాగు చేశారు. మరో వారం రోజుల తర్వాత కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు అంచనాకు వచ్చారు. కాని, ఇప్పటికే వరి కోతలు ప్రారంభమైనందున మరో వారం రోజుల తర్వాత కేంద్రాలను ప్రారంభిస్తే రైతులకు తీవ్ర నష్టం కలిగే అవకాశమున్నది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు లేక రైతులు మధ్య దళారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. వర్షాకాలం సీజన్లో సైతం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ యాసంగి సీజన్లోనైనా సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో వరికోతలు ప్రారంభమైనప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వలన రైతుల నుంచి తక్కువ ధరలకే కొనుగోలు చేయడానికి మధ్య దళారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా గ్రామాల్లో మధ్య దళారుల ప్రమేయం అధికమైంది. వరి చేన్లు కోసి ఎక్కువ రోజులు కల్లాల్లో ఉంచలేక రైతులు గత్యంతరం లేక మధ్య దళారులకు ధాన్యం విక్రయించాల్సి వస్తున్నది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే మద్దతు ధరకు విక్రయించేవారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వలన మధ్య దళారులు నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు. మరోవైపు ధాన్యం తడిస్తే కొనుగోలు చేసే వారుండరని రైతులు కూడా మధ్య దళారులు నిర్ణయించిన ధరలకే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు.
జిల్లాలో మరో వారం రోజుల్లో 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత వర్షాకాలంలో 26 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. ఈసారి కూడా డీసీఎంఎస్, ఐకేపీ, సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులు మరింత నష్టపోయే ప్రమాదమున్నది.
గత వానకాలంలో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అత్యధికంగా రైతులు బయటి మార్కెట్లోనే వరి ధాన్యం విక్రయించారు. కొనుగోలు కేంద్రాలకు అరకొరగానే ధాన్యం వచ్చింది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..? లేదా అన్న సందేహం రైతుల్లో నెలకొన్నది. గత వానకాలంలో వరికి క్వింటాలుకు రూ.2350 మద్దతు ధర కల్పించగా, బయటి మార్కెట్లో రైతులు రూ.3వేల వరకు వడ్లను విక్రయించారు. యాసంగికి సంబంధించి మద్దతు ధరపై ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు.
ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. నేను మూడు ఎకరాల్లో వరి పంట వేశాను. పంటలు పండించేందుకు రైతులకు అత్యధికంగా ఖర్చవుతున్నది. చివరికి ధాన్యం అమ్ముకుంటే రైతుకు ఏమీ మిగలడంలేదు. ప్రభుత్వం సరైన మద్దతు ధర కల్పించకపోవడంతో ఎంతోమంది రైతులు బయటి మార్కెట్లలో వడ్లను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వరి పంటకు మంచి మద్దతు ధర అందిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. – మ్యాగూడెం హన్మంతు, రైతు, కుమ్మరిగూడ, షాబాద్
యాసంగి సీజన్ వరి పంటలు కోత దశకు వచ్చినా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుంటే మేము ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కావడం లేదు. నేను ఐదు ఎకరాల పొలంలో వరిపంట సాగు చేశాను. మరో 15 రోజుల్లో పంటను కోయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు పంటను అమ్ముకునే సమయంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
– కొత్తపల్లి వెంకట్రెడ్డి, రైతు, కుమ్మరిగూడ, షాబాద్
గత ప్రభుత్వ హయాంలో పంటలు చేతికందే సమయానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. కాని, పంటల కోతలు ప్రారంభమై దళారులు దోచుకెళ్తున్నా ప్రస్తుత ప్రభుత్వ అధికారుల్లో చలనం లేదు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.
– కృష్ణారెడ్డి, ఎలిమినేడు రైతు
వరి కోతలు ప్రారంభమై, వరి ధాన్యం దళారులు తీసుకెళ్లిపోతున్నా కూడా ప్రభుత్వంలో చలనంలేదు. ఇప్పటికే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నష్టపోతున్నారు. వరి కోతలు పూర్తవుతుండటంతో దళారులు గద్దల్లా వచ్చి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నది.
– ఆంగోతు ప్రవీణ్నాయక్, ఇబ్రహీంపట్నం