ప్రస్తుత సమాజంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు.. దీనికి తోడు సోషల్ మీడియా యాప్‌లు.. కంపెనీలు ఇచ్చే ఉచిత ఆఫర్ల లింకులు.. ఇంకేముంది రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండేలా షీటీమ్స్ బృందాలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్ నెలను సైబర్ అవేర్నెస్ మాసంగా ఎంచుకుని విద్యార్థినుల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎల్ఈడీ స్క్రీన్లతో అవగాహన కల్పిస్తున్నాయి. సైబర్ మాయగాళ్ల వలలో చిక్కుకుంటే తక్షణం ఎలా స్పందించాలి ? బాల్య వివాహాలు జరిగితే ఏం చేయాలి?… ఈవ్‌టీజింగ్ తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కళాజాత బృందాలతో పాటలు, చిన్న చిన్న కథల రూపంలో చైతన్యాన్ని నింపుతున్నాయి.
– పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 25
పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 25 : సైబర్ నేరాల బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ మాయగాళ్ల వలలో చిక్కుకుంటే తక్షణం ఎలా స్పందించాలి? బాల్య వివాహాలు జరిగితే ఏం చేయాలి? ఎవరైనా దుండగులు మహిళలతో చెడుగా ప్రవర్తిస్తే ఎలా స్పందించాలి? అకస్మాత్తుగా ప్రమాదాలు చోటుచేసుకుంటే ఎలా వ్యవహరించాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు.. మరెన్నో సందేహాలకు సమాధానాలు ఇస్తున్నాయి షీ టీమ్స్. విద్యార్థి దశ నుంచే అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పిల్లల్లో వ్యక్తిగత, సామాజిక స్పృహను మేల్కొలుపుతున్నాయి. ‘పిల్లలూ జాగ్రత్తగా ఉండండి. ఫోన్ దూరం పెడితే సైబర్ నేరగాళ్లను దూరం పెట్టినట్టే. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోండి. మీకు మేమున్నాం’ అంటూ చైతన్యం తీసుకొస్తున్నాయి. సైబర్ అవేర్నెస్ మాసంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
అవగాహన లేక మోసాలు..
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ దాదాపు తప్పనిసరైంది. సోషల్‌మీడియా యాప్‌ల వినియోగం విపరీతమైంది. వివిధ కంపెనీలు ఉచిత ఆఫర్లతో పంపుతున్న లింకులు పెరిగిపోయాయి. ఫలితంగా సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. విద్యార్థులు సైతం ఇంటికే అన్నీ వచ్చేయాల్సిందే అనేలా తయారయ్యారు. ప్రతి దానికి ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నారు. అనవసరమైన లింకులు ఓపెన్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఖాళీ అయ్యేందుకు ఓ కారణం అవుతున్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఓ వైపు పోలీసులు సూచనలు చేస్తున్నా.. పట్టించుకోకపోవడం వల్లే ఈ తరహా మోసాలు పెరిగిపోయాయి. సైబర్ మోసాలపై అవగాహన కల్పించడంలో భాగంగా షీ టీమ్స్ బృందాలు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కళాజాత బృందాలతో చైతన్యం నింపుతున్నాయి. మోసాలు ఏ రూపంలో జరుగుతున్నాయి, ఏయే మార్గాల్లో మోసాలు జరిగే అవకాశం ఉన్నదో వివరిస్తున్నాయి. భారీ ఎల్ఈడీ స్క్రీన్లను బడులకు తీసుకెళ్తున్నాయి. పాటలు, చిన్న చిన్న కథల రూపంలో మోసాలపై అవగాహన కల్పిస్తున్నాయి.
ప్రతిచోటా నిఘా..
రాచకొండ కమిషనరేట్ పరిధిని ఏడు డివిజన్లుగా విభజించారు. ప్రతి డివిజన్‌లోనూ షీటీం బృందాలు ఉన్నాయి. ప్రతి బృందానికి ఎస్సై లేదా ఏఎస్సై ఇన్చార్జిగా ఉంటారు. ఆయనకు కొంతమంది సిబ్బందిని కేటాయిస్తారు. వీరు క్షేత్రస్థాయిలో నిఘా పెడుతారు. బస్టాండ్లు, మాల్స్, సంతలు, రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల్లో సామాన్యుల్లా తిరుగుతూ నిఘా వేస్తారు. ఎవరైనా అమ్మాయిలతో అతిగా ప్రవర్తించినా, చెడుగా వ్యవహరించినా వెంటనే వీడియో తీస్తారు. వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇస్తారు. మరోసారి అలా జరుగకుండా చూసుకోవాలని చెబుతారు. అవసరమైతే వారి తల్లిదండ్రులను పిలిపించి.. వారి ఎదుటే కౌన్సెలింగ్ ఇస్తారు.
షీటీమ్స్ బృందాలు ప్రభుత్వ పాఠశాలల్లో సైబర్ నేరాలతోపాటు మహిళల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాయి.
అనర్థాలు తెలిశాయి..
బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. 18 ఏండ్లు నిండకుండా పెండ్లి చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయో చెప్పారు. ఏవైనా సమస్యలు వస్తే పోలీసులను ఎలా సంప్రదించాలో వివరించారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎలా ధైర్యంగా ముందుకెళ్లాలో సూచించారు. సైబర్ నేరగాళ్లు మోసాలు చేసేందుకు ఏయే మార్గాల్లో వస్తారో, వారి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.
– వైష్ణవి, లిప్సిక, తొమ్మిదో తరగతి, ప్రభుత్వ పాఠశాల తట్టిఅన్నారం
ఎలా స్పందించాలో తెలిసింది..
సైబర్ నేరాలతోపాటు బాలిక భద్రతకు సంబంధించిన ఎన్నో అంశాలను షీటీమ్స్ బృందం తెలియజేసింది. నిజంగా ఇది మంచి కార్యక్రమం. జరుగుతున్న మోసాలను ఎల్ఈడీ స్క్రీన్‌పై వివరించడం బాగుంది. పిల్లలమంతా ఆసక్తిగా విన్నాం. ఏది మంచి, ఏది చెడో అవగాహన కలిగింది. దీనిపై ఉపాధ్యాయులు సైతం పదేపదే చెబుతున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలిసింది.
– కె.శిరీష, పదో తరగతి, ప్రభుత్వ పాఠశాల తట్టిఅన్నారం
అమ్మాయిలకు ఉపయోగకరం
షీటీమ్స్ కల్పిస్తున్న చైతన్యం అమ్మాయిలకు ఎంతో ఉపయోగకరం. ఇది మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలియజేస్తున్నారు. ఆపద వేళ ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నారు. మరెన్నో సామాజిక సమస్యలపై ఎలా స్పందించాలో తెలియచెప్పింది. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు భరోసా ఇస్తాయి. కష్టకాలంలో ఆపదను ఎలా ఎదుర్కోవాలో చెబుతాయి.
– ఉప్పునుంతల విష్ణుమూర్తి, ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, పెద్దఅంబర్‌పేట
మంచి కార్యక్రమం
షీటీమ్స్ కళాబృందాలతో పాటల ద్వారా అవగాహన కల్పించడం బాగుంది. ఇది పిల్లల మనసుల్లో నిలిచిపోతున్నది. ఆపత్కాలంలో ఎలా స్పందించాలో తెలియజేస్తున్నది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నది. పిల్లలు సైతం ఆసక్తి కనబరిచారు. ఉపాధ్యాయులు సైతం బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు.
– ప్రభాకర్‌గౌడ్, ప్రధానోపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తట్టిఅన్నారం
అవగాహన కల్పిస్తున్నాం..
సైబర్ అవేర్నెస్ నెల (అక్టోబర్)లో భాగంగా వనస్థలిపురం డివిజన్లోని దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాం. సైబర్ క్రైంలో భాగంగా లోన్ యాప్‌లపై మరింత అప్రమత్తం చేస్తున్నాం. మోసగాళ్లు ఎలా వల వేస్తారు? వారి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాం. ఒకవేళ మోసపోతే పోలీసులను ఎలా ఆశ్రయించాలో తెలియజేశాం.
– రాజేందర్‌రెడ్డి, ఏఎస్సై, షీటీమ్స్ ఇన్చార్జి, వనస్థలిపురం డివిజన్