కులకచర్ల, నవంబర్ 22 : ఆటో బోల్తాపడి ఆరుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా.. మిగతా 10 మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. కులకచర్ల మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 16 మంది విద్యార్థులు సోమవారం ముజాహిద్పూర్ కటింగ్ నుంచి ముజాహిద్పూర్ గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పీరంపల్లి గ్రామానికి చెందిన టాటా ఏస్ ట్రాలీ ఆటోలో వెళుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలు కాగా 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. స్వల్ప గాయాలైనవారికి స్థానిక దవాఖానలో చికిత్స నిర్వహించగా.. తీవ్ర గాయాలైన ఆరుగురిని నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
ఉస్మానియాకు తరలించిన విద్యార్థుల్లో నవీన్, అజయ్, ప్రవీణ్‌కుమార్, ప్రవీణ్, నితిన్‌కుమార్, చరణ్ ఉన్నారు. వీరు కులకచర్ల మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు. పాఠశాలకు చదువుకోవడానికి బస్సులో వెళ్లాల్సిన విద్యార్థులు బస్సు సరైన సమయానికి రాకపోవడంతో ఆటోలో లిఫ్ట్ అడిగి పాఠశాలకు వెళుతుండగా గాయాలయ్యాయి. కాగా అజాగ్రత్తతో వాహనాన్ని నడుపడంతోనే ఆటో బోల్తాపడి తీవ్ర గాయాలయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ట్రాలీ ఆటో ఓనర్‌పై కేసు నమోదు చేయడంతోపాటు ట్రాలీ ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
పరామర్శించిన మంత్రి సబితారెడ్డి
ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సబితారెడ్డి పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. గాయపడిన విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వమే వైద్య చికిత్సలు అందిస్తుందని.. ఎవ్వరూ ఆందోళన చెందరాదని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేలా పర్యవేక్షించాలని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవిని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి ఉన్నారు.