వికారాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఆసరా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పెంచుతామని హామీనిచ్చినా ఇప్పటివరకు పాలకులు పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువు లు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ. 2016 పింఛన్‌ను రూ. 4016కు, దివ్యాంగులకు ఇచ్చే రూ.4016 పింఛన్‌ను రూ.6,016 పెంచుతామని హామీనిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన ఆసరా పింఛన్‌దారులు పింఛన్ల పెంపు ఎప్పుడో అంటూ ఆశ గా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరు గ్యారెంటీలు, రైతు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు అంటూ ప్రచారం చేస్తున్నా ప్రతి పథకంలోనూ ఏదో ఒక కొర్రీ పెడుతూ అర్హులను లబ్ధిదారుల జాబితాల్లో లేకుండా చేస్తుండడంతో పేదలకు పథకాల ఫలాలు అందడం లేదు. అదేవిధంగా కొత్త పింఛన్లను జారీ చేస్తామని హామీనిచ్చినా ఇంకా పాత పింఛన్లే ఇస్తుండడంతోపాటు ఆసరా లబ్ధిదారులకు ప్రతినెలా అందించే పింఛన్ డబ్బుల పంపిణీలోనూ జాప్యం జరుగుతున్నది.
పింఛన్ల కోసం కొత్తగా 30 వేలకుపైగా లబ్ధిదారులు ఎప్పుడు మంజూ రు చేస్తారోనంటూ ఎదురుచూస్తున్నారు. పిం ఛన్ల పెంపు కోసం గతేడాదిగా జిల్లాలో పింఛన్‌దారులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ఫలి తం లేదు. పింఛన్ల పంపిణీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 20వ తేదీలోగా లబ్ధిదారులకు డబ్బులు అందజేయగా, ప్రస్తు తం 20 రోజులు ఆలస్యంగా అందుతున్నాయి. పింఛన్‌తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఆందోళన మొదలైంది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతూనే ఉన్నది.
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని పింఛన్‌దారులకు డబ్బుల పంపిణీ ప్రతినెలా 29 లేదా 30న ప్రారంభమై వారం రోజుల్లో పూర్తి అవు తుండగా.. కొడంగల్ నియోజకవర్గంలోని పిం ఛన్దారులు మాత్రం పింఛన్ కోసం మొదటి వారం పూర్తయ్యే వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా జిల్లాలోని 98,793 మంది పింఛన్‌దారులకు రూ. 24.38 కోట్ల పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు.