న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండియా, పాకిస్థాన్(India Vs Pakistan) మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలని కొందరు కోర్టులో పిల్ దాఖలు చేశారు. శుక్రవారం ఆ పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఆ లిస్టింగ్ కుదరని కోర్టు ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగేది క్రికెట్ మ్యాచే అని, అది జరగాల్సిందే అని కోర్టు చెప్పింది.
నలుగురు న్యాయవిద్యార్థులు దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఊర్వశి జైన్ నేతృత్వంలో పిటీషన్ వేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఆ పిల్‌ను లిస్టింగ్ కోసం తిరస్కరించింది. ఆదివారం మ్యాచ్ ఉందని, తమ పిల్‌ను శుక్రవారం లిస్ట్ చేయాలని కోరారు. కానీ ఆ మ్యాచ్ జరగాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది. లిస్టింగ్ చేయాలని న్యాయవాది కోరుకున్నా.. కుదరదని కోర్టు పేర్కొన్నది.
పెహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడడం సబబు కాదు అని, ప్రజా మనోభావాల పట్ల సమైక్యత లేదన్న సందేశాన్ని ఇస్తుందని పిటీషనర్లు తన పిల్లో వాదించారు. జాతి ప్రయోజనాల కన్నా క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వరాదు అని తెలిపారు. జాతీయ క్రీడా పరిపాలన బిల్లు అమలకు మార్గదర్శకాలు ఇవ్వాలని పిటీషనర్లు తమ పిల్లో కోరారు. అడ్వకేట్లు స్నేహ రాణి, అభిషేక్ వర్మ, అనాస్ చౌదరీ పిటీషనర్ల తరపున వాదించారు.