శనివారం 27 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 24, 2021 , 04:01:29

కాకులే పిల్లలు!

కాకులే పిల్లలు!

బిడ్డల్లెక్క సాకుతున్న రిటైర్డ్‌ హెచ్‌ఎం దంపతులు 

వాటిలో కొడుకు, బిడ్డను చూసుకుంటూ సంరక్షణ

క్రమం తప్పకుండా రోజూ ఆహారం 

ఉదయం బిస్కెట్లు, టిఫిన్‌.. మధ్యాహ్నం భోజనం

మూడేళ్ల నుంచి పెద్దసంఖ్యలో పక్షులు

ఉదయాన్నే కావ్‌.. కావ్‌.. పిలుపులు

సంబురపడుతున్న భార్యాభర్తలు

ఆ దంపతులకు కాకులే లోకం. తమ పిల్లల్లెక్క. ఉదయాన్నే వచ్చి పలుకరించే వాటిని విడిచి ఉండలేరు. వదిలి ఎక్కడికీ వెళ్లనూ లేరు. నిత్యం ఆహారం అందిస్తూ, కన్నబిడ్డల్లెక్క సంరక్షిస్తున్నారు. ఇంటి చుట్టూ వాలి ‘కావ్‌.. కావ్‌..’ అని అరుస్తోంటే, తమ పిల్లలే పిలిచారని సంబురపడుతారు. కానీ, ఈ ప్రేమ వెనుక ఓ విషాద గాథ ఉన్నది. అదేంటో మధ్యపేజీలో చదవండి.

- పెద్దపల్లి, జనవరి 23 (నమస్తే తెలంగాణ)

ఉద్యోగ విరమణ పొందిన ఆ దంపతులు కాకులను సంరక్షిస్తూ వాటిపై ప్రేమాభిమానాన్ని చాటుకుంటున్నారు. వాటికి సమయానుగుణంగా ఆహారాన్ని వండి పెట్టడంతోపాటు బిస్కెట్ల లాంటి చిరు తిళ్లను సమకూరుస్తూ పిల్లల్లా చూసుకుంటున్నారు. ఎవరూ పట్టించుకోని ఆ పక్షుల్లో తమ కొడుకు, బిడ్డలను చూసుకుంటూ పక్షి ప్రేమికులుగా గుర్తింపు పొందారు.

పెద్దపల్లి, జనవరి 23(నమస్తే తెలంగాణ): ఆ దంపతులు కాకులను కంటికి రెప్పలా సాకుతున్నారు. వాటిలో తమ కొడుకు బ్డిడలను చూసుకుంటున్నారు. దీని వెనుక కదిలించే ఓ కన్నీటి కథ ఉన్నది. సుల్తానాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు. 2007 వరకు వీరి జీవితం ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగింది. కానీ, విధి వెక్కిరించింది. బీటెక్‌ ఫైనలియర్‌ చేస్తున్న కూతురు పుణ్యవతి (20) 2007లో బ్రెయిన్‌ ట్యూమర్‌తో చనిపోయింది. దాని నుంచి తేరుకోక ముందే మరో విషాదం వెంటాడింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న కొడుకు వెంకటరమణ (25), 2010లో బోన్‌ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోవడం వారిని తీవ్రంగా కుంగదీసింది. ఆ దుఃఖం నుంచి మెల్లమెల్లగా తేరుకునే ప్రయత్నం చేశారు. 2010లో సత్యనారాయణ తన చెల్లె కొడుకు హరికృష్ణ (18)ను దత్తత తీసుకున్నారు. చదివించి, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో ఉద్యోగం వచ్చిన తర్వాత 2016లో పెళ్లి చేశారు. 2014లో సత్యనారాయణ, 2016లో భాగ్యలక్ష్మి రిటైర్డ్‌ అయ్యారు.

కాకులే లోకంగా..

బిడ్డ, కొడుకు కర్మకాండల సమయంలో పిండం (ఆహారం) పెట్టినప్పుడు కాకులు పెద్ద సంఖ్యలో వచ్చి తిన్నాయి. మరణించిన తమ పిల్లలు, పెద్దలే వచ్చి తిన్నారని, వారు సంతృప్తి చెందారని ఆ దంపతులు భావించారు. ఆ విషయాన్ని తమ మనుసు తొలగించలేక పోయారు. రిటైర్డ్‌ అయిన తర్వాత కాకులను చేరదీయడం మొదలుపెట్టారు. ప్రతి రోజూ తమ ఇంటి ముందు గోడపై ఆహారం, నీళ్లు పెట్టడం ప్రారంభించారు. మెల్లమెల్లగా కాకులు రావడం మొదలైన తర్వాత సంరక్షణపై మరింత దృష్టి పెట్టారు. ఉదయం 6గంటలకు బిస్కెట్లు, 8గంటలకు ఇంట్లో ఏ టిఫిన్‌ ఉంటే ఆ టిఫిన్‌ (ఇడ్లీ, వడ, దోస, ఉప్మా), మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం (అన్నం, కూర కలిపిన ఆహారం) పెడుతున్నారు. వీటి కోసం ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. తమ పిల్లల్లా సాకుతూ, ఏలోటు రాకుండా చూస్తున్నారు. మూడేళ్ల నుంచి కాకుల సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం 30 వరకు చేరిందని ఆ దంపతులు సంబురపడుతున్నారు. ఉదయాన్నే ఇంటి పరిసరాల్లో వాలి సందడి చేస్తాయని, ‘కావ్‌ కావ్‌'మంటూ తమను నిద్రలేపుతాయని సంతోషంగా చెబుతున్నారు. 

సాయంలోనూ పెద్దమనసు..

సత్యనారాయణ దంపతులు సేవా కార్యక్రమాలతోనూ పెద్దమనసు చాటుకుంటున్నారు. తమను నమ్ముకుని వచ్చే పేదలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. పేదపిల్లల చదువులు, ఆడ పిల్లల పెండ్లికి 2లక్షల సాయం అందిస్తున్నారు. వృద్ధులకు నెల నెలా పింఛన్‌ ఇస్తున్నారు. అన్నదానాల కోసం పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కరీంనగర్‌లోని పలు ఆలయాలకు 3లక్షల వరకు విరాళం ఇచ్చారు. కరీంనగర్‌లో తమకున్న ఇంటిని తక్కువ రెంట్‌కే ఇస్తున్నారు. దాదాపు ప్రతి నెలా 10వేలకు పైగా ఖర్చు చేస్తూ, సేవాగుణం చూపుతున్నారు.

మా పిల్లలు తిన్నట్లే అనిపిస్తుంది..

మా ఇంటి పెద్దలతో పాటు కొడుకు, బిడ్డ నలుగురు మృతి చెందడం మమ్మల్ని తీవ్రంగా కలచి వేసింది. చాలా కుంగిపోయాం. అప్పటి నుంచి పక్షులనే పిల్లలుగా భావిస్తున్నాం. కాకులతో స్నేహం చేస్తున్నాం. వాటి కోసమే ఇంటి వద్ద ఉంటున్నాం. ఎక్కడికి వెళ్లినా వాటి సమయం వరకు కచ్చితంగా ఇంటికి చేరుకుంటున్నాం. ప్రతి రోజూ వాటికి ఆహారం పెడుతున్నాం. మధ్యాహ్నం అన్నంలో ఆమ్లెట్‌ను అవి బాగా ఇష్టంగా తింటాయి. అందుకే ప్రతి రోజూ ఆమ్లెట్‌ పెడుతున్నాం. అవి వచ్చి తింటుంటే మా పెద్దలు, పిల్లలే తింటున్నట్లు అనిపిస్తుంది. అవి ఇంటి పైకి వచ్చి కావ్‌.. కావ్‌ అని పిలుస్తోంటే.. మా బిడ్డలే మమ్మల్ని పిలుస్తున్నట్లు అనిపిస్తున్నది.  

-అల్లం భాగ్యలక్ష్మి - సత్యనారాయణ 


VIDEOS

logo