మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Aug 25, 2020 , 03:59:07

పరిశుభ్రత కోసం ‘పది నిమిషాలు’

పరిశుభ్రత కోసం ‘పది నిమిషాలు’

కార్పొరేషన్‌/కొత్తపల్లి: జిల్లాలోని కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ‘ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు  విజయవంతంగా చేపడుతున్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు మంత్రి కేటీఆర్‌ మూడు నెలల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమంపై ప్రజల్లో సైతం అవగాహన వచ్చింది. ప్రతి ఆదివారం ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు ఇంటి ఆవరణలో పాత టైర్లు, డబ్బాలు, పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నారు. దీంతో దోమల బెడద తగ్గి సీజనల్‌ వ్యాధులు అదుపులోకి వస్తున్నాయి. 

ప్రతి వారం క్రమం తప్పకుండా

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ‘ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమం ప్రతి వారం క్రమం తప్పకుండా చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పాల్గొని తమ ఇంటితో పాటు  పలు కాలనీల్లోని ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. నగర మేయర్‌ వై సునీల్‌రావు వారానికో డివిజన్‌లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వీరితో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు సైతం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ప్రజలు సైతం భాగస్వాములై తమ ఇండ్ల ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నారు. 

మెరుగుపడిన పారిశుద్ధ్యం

కరోనా నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్యం విషయంలో మేయర్‌తో పాటు కార్పొరేటర్లు, అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి డివిజన్‌లో దోమలు వృద్ధి చెందకుండాఎప్పటికప్పుడు ఫాగింగ్‌ చేయిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో  నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. మురుగు నీటి గుంతల్లో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్‌ బాల్స్‌, గంబూషియా చేపలు వేస్తున్నారు. మురుగు కాలువల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు వస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందిస్తున్నారు.  

తగ్గిన సీజనల్‌ వ్యాధులు

వానకాలంలో దవాఖానలు రోగులతో కిటకిటలాడేవి. ఈసారి మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా వంటి సీజనల్‌  వ్యాధుల బారిన పడే వారి సంఖ్య కొంత మేరకు తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన రావడంతో రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారం తీసుకోవడంతో పాటు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. వానకాలం ముగిసే ఇలాగే పాటించాలని వైద్యులు  సూచిస్తున్నారు.