సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Aug 22, 2020 , 01:36:46

ఈ-పాస్‌ యంత్రాలతోనే ఎరువులు

ఈ-పాస్‌ యంత్రాలతోనే ఎరువులు

పెద్దపల్లి జంక్షన్‌: వానకాలం పంటకు సంబంధించిన ఎరువులను రైతులకు ఈ పాస్‌ యంత్రాలతోనే విక్రయించాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ ఎరువుల డీలర్లను ఆదేశించారు. ఎరువుల అమ్మకాలపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, ఎరువుల డీలర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువుల కేటాయింపులను ఈ పాస్‌ యంత్రాల ద్వారానే పర్యవేక్షిస్తారని తెలిపారు.  ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఎరువుల క్రయ విక్రయాలపై వ్యవసాయాధికారులు సంపూర్ణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఏవో తిరుమల్‌ ప్రసాద్‌, ఏవోలు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. పల్లె ప్రగతి, హరితహారం, రైతు వేదికల నిర్మాణాలకు సంబంధించిన భూ సమస్యలపై సంబంధిత అధికారులతో శుక్రవారం వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో నర్సరీ, డంప్‌ యార్డ్‌, వైకుంఠధామం, ప్రకృతి వనం, కంపోస్ట్‌ షెడ్‌ ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఆరో విడత హరిత హారం లక్ష్యాలను ఈ నెల 24తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఆర్డీవో శంకర్‌ కుమార్‌, డీఆర్డీవో వినోద్‌, జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్‌, డీఏవో తదితరులు ఉన్నారు.