బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Apr 27, 2020 , 01:42:50

ఎండాకాలం.. ఉపశమనం

ఎండాకాలం.. ఉపశమనం

  • లాక్‌డౌన్‌తో ఇండ్లలోనే ప్రజలు 
  • పరోక్షంగానైనా ఎండ వేడిమి నుంచి రక్షణ
  • రోజురోజుకూ పెరుగుతున్న వడగాలులు
  • 41-42 డిగ్రీల మధ్య నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
  • వరికోతలు, కొనుగోళ్ల నేపథ్యంలో రైతులకు జాగ్రత్తలు తప్పనిసరి

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : విశ్వమారి కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తితో అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ సూరీడి వేడి నుంచి ఉపశమనం మాత్రం పొందుతున్నారు. మార్చి మూడో వారం నుంచి క్రమంగా ఎండలు పెరుగగా.. ఏప్రిల్‌ మూడో వారం నుంచి సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వారం  నుంచి 41 నుంచి 42 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, వీటికి వడగాలులు తోడయ్యాయి. మే నెలలో 49 డిగ్రీల వరకూ పెరిగే అవకాశాలున్నాయని జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ లేకుంటే ప్రజలపై ఎండ ప్రభావం తీవ్రంగా ఉండి, వడదెబ్బ మరణాలు కూడా సంభవించేవి. గతేడాది ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో మృతిచెందారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయట తిరిగేందుకు అనుమతి లేకపోవడం, వ్యాపార రంగాల నుంచి మొదలుకొని అన్ని దుకాణాలూ మూసి ఉండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. వడదెబ్బ మరణాలు కూడా తగ్గాయి. కాగా, వరికోతలు, ధాన్యం అమ్మకాల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు, హమాలీలు, అధికారులు, సిబ్బంది, రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఎండదెబ్బ నుంచి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చేసుకోవాలని, రోజూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగాలని, కీరదోస, పుచ్చకాయ వంటి నీటి నిలువలు పుష్కలంగా ఉన్న పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు. తలకు టోపీ లేదా తువ్వాల లాంటివి చుట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గంట సమయానికి మించి ఎండలో ఉండరాదని సూచిస్తున్నారు.