మహబూబాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షోకు జనం ప్రభంజనమై కదలివచ్చారు. నలుదిక్కుల(వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు) నుంచి చీమలపుట్టల్లోంచి బారులు తీరినట్టు కదంతొక్కారు. ఏజెన్సీ సహా అన్ని ప్రాంతాల నుంచి దండులా రావడంతో మహబూబాబాద్ పట్టణం జనసంద్రమైంది. బస్సుయాత్ర జిల్లాలో ప్రవేశించింది మొదలు అడుగడుగునా నీరాజనం పలికారు. డప్పుచప్పుళ్ల నడుమ నెత్తిన బతుకమ్మలు, బోనాలతో ఎదురేగి ఘన స్వాగతం పలికారు.
భారీ కటౌట్లు, గులాబీ తోరణాలతో మానుకోట ప్రాంతమంతా గులాబీమయమైంది. కేసీఆర్ బస్సు పైకి రాగానే రోడ్డుషో ప్రాంగణంతా ‘కేసీఆర్.. కేసీఆర్.. సీఎం సీఎం’ అంటూ నినాదాలతో మార్మోగింది. బుధవారం సాయంత్రం కొత్తగూడెం నుంచి బయల్దేరిన కేసీఆర్ ఇల్లెందు నుంచి బయ్యారం మీదుగా మానుకోట పట్టణానికి చేరుకున్నారు.
జిల్లా ఆసుపత్రి ముందు నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు చేరుకున్నారు. కేసీఆర్ తన ప్రసంగంలో మానుకోట అని ప్రస్తావించినప్పుడల్లా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. మానుకోట జిల్లా ఉండాలా? వద్దా? అన్నప్పుడు ప్రజలు ఉండాలి అంటూ నినాదాలు చేశారు. ‘మీ ఉత్సాహం చూస్తుంటే మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ ప్రతాపం పార్లమెంట్ ఎన్నికల్లో చూపించి కవితను గెలిపించాలి’ అని చెప్పినప్పుడు జనం ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. అశేష జనం తరలిరావడంతో మానుకోటలో కేసీఆర్ రోడ్‌షో గ్రాండ్ సక్సెస్ కాగా, బీఆర్ఎస్ శ్రేణుల్లో నయాజోష్ వచ్చింది.