రుద్రంపూర్, ఫిబ్రవరి 24 : నిత్య జీవితంలో సైన్స్‌ను అన్వయించుకుంటూ జీవన విధానంలో భాగంగా మార్చుకుంటే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి అన్నారు. మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆనంద ఖని పాఠశాల నందు జిల్లా స్థాయిలో టాలెంట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో 9వ తరగతి చదువుతున్న కె.వరుణ్ సాయి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జగన్నాధపురం విద్యార్థి, ప్రథమ బహుమతిని సాధించాడు. ఈ విద్యార్థికి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని బి.దుర్గా శైలజ గైడ్ టీచర్‌గా మార్గనిర్దేశనం చేశారు. ద్వితీయ బహుమతి బి. ధనుష్, ఉన్నత పాఠశాల ఆనందఖని విద్యార్థి, తృతీయ బహుమతి షేక్ నజీమా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భద్రాచలం విద్యార్థిని సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ సంపత్ కుమార్, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు నాగరాజ్ శేఖర్, సైదులు, సతీష్, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు అమీరుద్దీన్, యశోద, అనురాధ, మోహన్ పాల్గొన్నారు.