న్యూఢిల్లీ: నీట్-యూజీ ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో సీబీఐ తాజాగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. పేపర్ లీక్ కేసులో అరెస్టయిన 13 మంది నిందితుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి వ్యతిరేకంగా రూపొందించిన చార్జ్‌షీట్‌ను మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ఆర్థిక నేరాల విభాగం సమర్పించింది. దీంతో కేంద్రం ఏర్పాటుచేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముందుకు చార్జ్‌షీట్ రాబోతున్నది.
కేసుకు సంబంధించి తదుపరి చర్యలపై కోర్టు నిర్ణయం తీసుకోనున్నది. పేపర్ లీక్ కేసులో అరెస్టయిన 13మంది నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వీరంతా ప్రైవేట్ వ్యక్తులే. చార్జ్‌షీట్‌లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఏవీ లేకపోవటం గమనార్హం. నిందితుల బెయిల్ పిటిషన్‌పై ఆగస్టు 3న కోర్టు విచారణ చేపట్టనున్నది.