NIMS | ఖైరతాబాద్, మే 1 : నిమ్స్ దవాఖానలో ఏడాదిన్నర చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాదిపతి డాక్టర్ నగరి బీరప్ప నేతృత్వంలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి బాలిక ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా గుర్రంపాడు మండలం కొప్పోలుకు చెందిన బాలవిజయ్, లావన్య దంపతుల కుమార్తె సత్యశ్రీ (ఏడాదిన్నర) గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నది.
తల్లిదండ్రులు పలు ప్రైవేట్ దవాఖానల్లో చూపించగా, హెపటోబ్లాస్టోమా వ్యాధిగా గుర్తించిన వైద్యులు నిమ్స్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. నిమ్స్‌లో వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు 7 X 5 సెంటీమీటర్ల కణితిని గుర్తించారు. అది సగం వరకు కాలేయాన్ని చుట్టేయడంతో శస్త్రచికిత్స అత్యంత క్లిష్టంగా మారింది. డాక్టర్ బీరప్ప నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం సవాల్‌గా తీసుకొని వివిధ విభాగాల సమన్వయంతో చికిత్సను ప్రారంభించారు.
ముందుగా కణితి సైజును తగ్గించేందుకు మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో నాలుగు దఫాలు కీమో థెరపి చేశారు. అనంతరం శస్త్రచికిత్స నిర్వహించి కాలేయంలోని కణితితో కూడిన కాలేయం కుడి వైపు భాగాన్ని పూర్తిగా తొలగించారు. 24/7 బాలికను పర్యవేక్షించిన వైద్యులు విజయంతంగా చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆ బాలిక కోలుకోగా డిశ్చార్జి చేశారు. ఈ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీలో పూర్తిగా ఉచితంగా చేయడం విశేషం.