చిన్నకోడూరు, మే 1: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రతో సీఎం రేవంత్‌రెడ్డి గజగజ వణుకుతున్నాడని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవా రం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, మండల నాయకులతో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజల కోసం కేసీఆర్ బస్సుయాత్ర చేస్తుంటే కాంగ్రెస్, బీజేపోళ్లకు కండ్లు మండుతున్నాయన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం స్థాయి మరిచి కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిపై దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీ మతవిద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ లేకుం టే తెలంగాణ వచ్చేదా, కొత్త జిల్లాలు అయ్యేవా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలన ఏ పాటిదో ప్రజలకు అర్థమైందన్నారు. ఇచ్చిన హామీ లు అమలు చేయని దద్దమ్మపార్టీ అన్నారు. రఘునందన్‌రావు మనకు నష్టం చేశారని, దుబ్బాక ఉప ఎన్నికలో అనేక హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపాడని, దుబ్బాకలో చెల్లని వ్యక్తి ఇక్కడ ఎలా చెల్లుతాడని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ప్రజలందరూ దీవించి పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు.
పేదలకు సేవ చేసే అవకాశమివ్వండి: వెంకట్రామిరెడ్డి
పేదలకు సేవచేసే అవకాశమిచ్చి, ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రజలను కోరారు. మీ అందరి ఆదరణతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మీలో ఒకడిగా ఉంటానని, ప్రజల కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటానని హామీనిచ్చారు. విద్యకు ప్రాముఖ్యతనిచ్చి పేద పిల్లల కోసం రూ.వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానన్నారు. పేదల కోసం నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ నిర్మిస్తానన్నారు.
యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మంచి ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం గౌడ్, వైస్ ఎంపీపీ పాపయ్య, మెదక్ ఉమ్మడి జిల్లా గొర్లకాపరుల మాజీ అధ్యక్షుడు శ్రీహరి యాదవ్, సీనియర్ నాయకుడు రామచంద్రం, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గుండెల్లి వేణు, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.