బోధన్/బోధన్ రూరల్, మే 1: తాను హోంశాఖ మంత్రిని అవుతానంటూ పోలీసులు, అధికారులపై ఒత్తిడి తెస్తూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నిరంకుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. షకీల్ స్థానికంగా ఉంటే బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వస్తాయన్న భయంతో ఇక్కడికి రాకుండా ఆయనతోపాటు ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌కు స్నేహితులుగా ఉన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి కలిసి ఐదేండ్ల క్రితం ఎంపీ ఎన్నికల్లో కవితను ఓడించేందుకు బీజేపీకి ఓట్లు వేయించారని, ఈ ఇద్దరూ ఇప్పుడు సెక్యులర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని బాజిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ఎంతమాత్రం ప్రేమలేదని, 2004 నుంచి ఆ పార్టీ నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామంటూ ఎన్నికల్లో హామీలు ఇస్తూ ప్రజలను మోసంచేసిందని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఓట్ల కోసం మరోసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిజాం షుగర్స్ తెరిపిస్తామంటూ బూటకపు హామీలు ఇస్తున్నాయన్నారు.

నిజామాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ పసుపు బోర్డును ఇస్తున్నామని హడావిడి చేశారని, పసుపు బోర్డు ఎటుపోయిందని ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే బోధన్ – బీదర్ రైల్వేలైన్ నిర్మాణం జరిగేలా కృషిచేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ హామీ ఇచ్చారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ బోధన్‌కు నడిచేలా, గతంలో ఉన్న బోధన్-మిర్జాపల్లికి ప్యాసింజర్ రైలును పునరుద్ధరించేలా కృషి చేస్తానన్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోతున్న యువత కోసం తాను గల్ఫ్ పాలసీని తీసుకువచ్చేందుకు పోరాడుతానన్నారు.
బోధన్ మండలంలోని పెగడాపల్లి గ్రామంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం, కార్నర్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు చర్యలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయన్నారు. కేవలం అధికార దాహంతోనే ఆరు గ్యారెంటీల పేరిట ఆశజూపి ప్రజలను నిండాముంచిందని ఆరోపించారు. రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. మరోసారి కాంగ్రెస్‌పార్టీకి ఓటు వేసి కష్టాలు కొనితెచ్చుకోవద్దని కోరారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, దేవుళ్ల పేరుతో ఆ పార్టీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను విజయం సాధిస్తే పెగడాపల్లి గ్రామంలో జాతీయ బ్యాంకును ఏర్పాటు చేయిస్తానన్నారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. ముస్లిం పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే కేసీఆర్ సర్కారు ఏర్పాటుచేసిన మైనార్టీ గురుకులాలే కారణమన్నారు. పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిస్తే ఆయన కోసం జగిత్యాలకు వెళ్లాల్సివస్తుందని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల గొంతుక అని, ఇక్కడి సమస్యలు కేంద్రం వద్ద వినిపించాలంటే బాజిరెడ్డిని పార్లమెంట్‌కు పంపాల్సిన అవసరముందని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దాదన్నగారి విఠల్‌రావు అన్నారు.