ముంబై : టీ20 ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు వేయికండ్లతో వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్ షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. మార్చి 28 నుంచి మొదలుకానున్న ఈ సీజన్ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేయనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా మంగళవారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపాడు. తొలి దశ షెడ్యూల్‌ను ఈనెల 12 లేదా 13న విడుదల చేసే అవకాశమున్నట్టు ఆయన చెప్పాడు. సైకియా మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేయనున్నాం. తొలుత 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈనెల 12 లేదా 13 తేదీల్లో విడుదల చేస్తాం. రెండో దఫా షెడ్యూల్‌కు సంబంధించి.. అసెంబ్లీ ఎన్నికల తేదీలను బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నాడు. ఈ వేసవిలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. అయితే ఏదేమైనా ఐపీఎల్ సీజన్‌ను మే 31తో ముగిస్తామని సైకియా స్పష్టం చేశాడు.
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధం సెగలు ఐపీఎల్‌కూ తాకాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇప్పటికే పశ్చిమ, మధ్య ఆసియాలో పలు దేశాలు విమానయాన సేవల్లో ఆంక్షలు విధించగా ఇరాన్ దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరులో హోటల్ ఓనర్స్ అసోసియేషన్ తమ వద్ద రెండు, మూడు రోజులకే సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని, ఇలా అయితే హోటల్స్‌ను నడుపలేమంటూ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కొద్దిరోజుల్లోనే ముంబై, బెంగళూరులో సుమారు 20 శాతం హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడే ప్రమాదమున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే ఐపీఎల్ వ్యూయర్షిప్నకూ తిప్పలు తప్పకపోవచ్చునన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘ఈ సమస్య మా దృష్టికీ వచ్చింది. అయితే టోర్నీ ప్రారంభం (మార్చి 28) నాటికి ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేం ఆశిస్తున్నాం. మేం ఇందుకు సంబంధించిన ఇతర ఆప్షన్లపైనా దృష్టి పెట్టాలి’ అని చెప్పాడు.