ఖలీల్‌వాడి, మే 1: భానుడి భగభగతో ఈ ఏడాది రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్య ప్రతాపానికి నిజామాబాద్ జిల్లా నిప్పులకొలిమిలా మారింది. ఎండ తాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 దాటిందంటే జనం బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
వాతావరణం పూర్తిగా పొడిగా మారింది. గతేడాదికన్నా నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతగా రికార్డయ్యింది. ఉదయం 8 గంటల నుంచే ఉక్కపోత మొదలుకావడంతో ఇందూరు వాసులు చెమటలు కక్కుతున్నారు. ఎండలకు తోడు వడగాలులు సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో దినసరి కూలీలు, రైతులు, వివిధ రంగాల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వడదెబ్బ మరణాలు సైతం చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. రాత్రిపూట కూడా వాతావరణం వేడిగానే ఉంటున్నది. దీంతో కూలర్ల చల్లదనం కూడా సరిపోవడంలేదు. కంటిమీద కునుకు రావడంలేదు.
ఎండల తీవ్రతకు జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నప్పటికీ దంచి కొడుతున్న ఎండలతో సందడి కనిపించడం లేదు. అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉదయం, సాయంత్రం పూటనే ప్రచారం చేసేందుకు బయటికి వస్తున్నారు. రోడ్‌షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఎండల కారణంగా షెడ్యూల్లో మార్పు చేసుకుంటున్నారు. కొన్ని పార్టీల ప్రచారానికి జనం లేక కార్యక్రమాలు వెలవెలబోతున్నాయి.
ఎండల తీవ్రత కారణంగా వాతావరణ శాఖ నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అల ర్ట్ జారీచేసింది. వేడిమితోపాటు వడగాలుల ప్రభావం ఉంటుందని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వర కు బయటికి రావొద్దని హెచ్చరించింది. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. దీం తో జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు.
ఎండలు దంచి కొడుతుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఆరోగ్య కేంద్రాలతోపాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఉపాధి పనులు చేపట్టిన ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రతిరోజూ 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. బయటికి వెళ్తే ఎక్కువగా నీడపట్టున ఉండాలని, శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు, గొడుగు లేదా తలకు టోపీ ధరించాలన్నారు.
అత్యధిక ఉష్ణోగత్రలు నమోదు కావడంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతేనే బయటికి రావాలి. వడదెబ్బ తగిలిన వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేశాం.