రెండు దశాబ్దాల కిందట ఆనాటి రహస్య రాజకీయ పోరులో పని చేస్తున్న నాయకుడొకరు ‘జారుడుబండ మీద’ అనే పుస్తకం రాశారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్‌తో పాటు కొంతమంది మిత్రులం కలిసి విలువైన ఆ పుస్తకంపై ఒక రాత్రంతా చర్చించిన ఘటన ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. వ్యక్తులు గానీ, వ్యవస్థ గానీ జారుడుబండ మీద కోరి నిలబడ్డ తర్వాత అంతిమ గమ్యం పాతాళమే అవుతుందని.. గుండెల్ని మెలేసే, ఉక్కిరిబిక్కిరి చేసే అనేక ఉదాహరణలతో పుస్తకంలో వివరించారు రచయిత. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు, చర్యలు చూస్తుంటే మళ్లీ ఆ పుస్తకం గుర్తుకొచ్చింది.
వ్యవస్థల హననానికి, ఉద్యమాల దహనానికి పాల్పడిన పార్టీలే ప్రవచనాలు వల్లిస్తుంటే.. ఊసరవెల్లి కూడా తనను మించిన మోతుబరులొచ్చారని ఉలిక్కిపడకుండా ఉండలేదేమో? ఏడు దశాబ్దాల దేశ రాజకీయాలను, పాలన యంత్రాంగాలను ప్రజాప్రయోజనాలకు దూరంగా లాక్కెళ్లిన ఘనులే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. గురివింద గింజ తన కింద నలుపెరగదన్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ నీళ్లు లేని బావిలో ఈత కొట్టేందుకు తంటాలు పడుతుంటే, మెట్ల మీద కూర్చొని చప్పట్లు కొట్టే మిత్రుడిలా బీజేపీ వ్యవహరిస్తున్నది. జారుడుబండ మీద నిలబడి ఇతరులపై రాళ్లు విసిరే దిగజారుడుతనాన్ని హస్తం, కమలం పార్టీలు ప్రదర్శిస్తున్నాయి.
Congress-BJP | కృష్ణా ట్రిబ్యునల్, మేడిగడ్డ, పాలమూరు-రంగారెడ్డి అంశాలను చర్చకు తీసుకొచ్చి, వాటిపై అవగాహన లేక తెల్లమొహం వేసిన హస్తం ప్రభుత్వం.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ డ్రామాతో మీడియాకు లీకులిస్తూ గత ప్రభుత్వంపై బురదజల్లే ఎత్తులను కొనసాగిస్తున్నది. సొంత సామాజికవర్గానికి చెందినవారినే ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు కీలక అధికారులుగా నియమించుకున్న రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వంలో కుట్రలు జరిగాయని వారితో ఆరోపణలు చేయిస్తే విలువ ఉంటుందా? సున్నితమైన ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీల పనిలో కూడా తలదూర్చి, నిందలను నిజం చేసేందుకు వాటిని కూడా వాడుకోజూడటం రాజనీతి అనిపించుకుంటుందా? నిజానికి ట్యాపింగ్‌లు, కోవర్టుల సంప్రదాయానికి నాంది పలికిందే కాంగ్రెస్, బీజేపీలు కదా. మొన్నటికిమొన్న దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వివాదంలో మోదీ సర్కారే అనుమానాల బోనులో దోషిగా నిలబడింది కదా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఎన్నో వాస్తవాలను బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి బట్టబయలు చేశారు కూడా. కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆర్ఎస్ఎస్ ముఖ్యులు, పాత్రికేయుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని కాషాయ సర్కార్‌పై ఆరోపణలు రాలేదా? దీనికి తోడు విమర్శకులను టార్గెట్ చేసే లక్ష్యంతో ఐదేండ్ల పాటు కస్టమర్ల డాటా నిల్వ ఉంచాలని వీపీఎన్ ప్రొవైడర్లకు కేంద్రం హుకుం జారీ చేసి, బుద్ధిజీవుల ముందు అభాసుపాలైంది కదా!
కమలం పార్టీ బురద రాజకీయాల్లో వికసించినట్టే, హస్తం పార్టీ కూడా అరచేతులతో మలినమే ఎత్తుకున్నది. 2021లో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కార్.. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సహా సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నదనే ఆరోపణలు వచ్చాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ సహా అనేక మంది నేతలు అశోక్ గెహ్లాట్ సర్కార్‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు.
రాజకీయాల్లో వీడు తుక్కూ కాదు, వాడు ఉక్కూ కాదని తెలంగాణ కవి చెరబండ రాజు అన్నట్లుగా.. రాజకీయ నాయకుల కదలికలపై నిఘాలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు జననాడిలో ఏ1, ఏ2 ముద్దాయిలుగానే ఉన్నాయి.
దర్యాప్తు ఏజెన్సీలతో బ్లాక్ మెయిలింగ్, బుల్డోజర్లతో బెదిరింపులకు పాల్పడటంలో కాంగ్రెస్, బీజేపీలు నాణానికి ఇరువైపులా ఉండే బొమ్మాబొరుసులుగా మారిపోయాయి. బీఆర్ఎస్ పనైపోయిందని హస్తం, కమలం పార్టీలు పలుకుతున్న ప్రగల్భాలే నిజమనుకుంటే.. రేవంత్ సర్కార్‌కు దర్యాప్తు సంస్థలు, బుల్డోజర్ల అవసరమెందుకొచ్చింది? లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు బీఆర్ఎస్ నేతల వెంటపడాల్సిన అవసరం కమలం పార్టీకి ఎందుకొచ్చింది? అభ్యర్థులు దొరక్క కాదా? బీఆర్ఎస్ నేతలు పార్టీ మారిన మరునాడే ఎంపీ అభ్యర్థులుగా బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రకటించే స్థాయికి దిగజారడం ఆ పార్టీల దుస్థితికి నిదర్శనం కాదా? నది వెంట పడ్డ నీటి దొంగల్లా, గులాబీ పార్టీ నేతల వెంట రెండు జాతీయ పార్టీలు పడి పరువు పోగొట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర దళంగా, బలంగా, భవితకు భరోసాగా కేసీఆర్‌పై ప్రజారాశుల ప్రబలమైన విశ్వాసం సన్నగిల్లకపోవడం వల్లనే కదా.. కలిసికట్టుగా కాంగ్రెస్, బీజేపీలు గులాబీ గూటిలోంచి కేసీఆర్ శిష్యులను ఎగరేసుకుపోయేందుకు పన్నాగాలు పన్నుతున్నాయి. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వ మాటతీరులోనే పరమానందయ్య శిష్యుల విజ్ఞానం వెల్లివిరుస్తున్నది. ఇటీవల మోదీని పెద్దన్నగా స్వీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి.. పట్టపగలే తాను నరేంద్రమోదీ వద్ద రోబోననే నిజాన్ని తేటతెల్లం చేశారు. పైగా పెద్దన్నగా సంబోధిస్తే తప్పేంటని హస్తం, కాషాయం నేతలు వ్యాఖ్యానించడం విషయ పరిజ్ఞానం ఉన్నోళ్లకు నవ్వులు తెప్పించింది. పెద్దన్న పాత్ర అంటే పెత్తనం చెలాయించి, సోదరుల సొమ్ములూ ఊడ్చేసే నైజమని వారికెవరు చెప్పాలి? అమెరికాను పెద్దన్న పాత్ర పోషించడం ఆపాలని వర్ధమాన దేశాలెందుకు నిలదీస్తున్నాయో హస్తాదులు, వస్తాదులకు వివరించే శక్తి ఎవరికీ లేనేలేదు.
బ్రేకింగ్ న్యూస్‌ల కోసం బొక్కబోర్లా పడుతున్న సీఎం రేవంత్ తీరు, విస్తరణ కోసం వత్తాసు పలుకుతున్న బీజేపీ ధోరణి తెలంగాణ రాజకీయాల్లో విలువలను బలిపీఠమెక్కిస్తున్నాయి. నిన్నటికి నిన్న కాంగ్రెస్‌కు అడ్డొస్తే బస్సు మీదికెక్కించి తొక్కిస్తానని సీఎం మాట్లాడటం సబబేనా? 90 లక్షలకు పైగా అర్హులుంటే.. సగం మందికి కూడా గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ఇవ్వలేక, ఉచిత బస్సు ప్రయాణాన్ని అవస్థలమయంగా మార్చింది చాలక, ప్రతి మహిళకు నెలనెలా ఇస్తామన్న రూ.2500 ఎగ్గొట్టింది మరిచి, మహిళా లోకానికి అసత్యాలు బోధిస్తున్నారు.
సాగునీరు మాయమై, తాగునీరు గగనమై, మళ్లీ గ్రామాల్లో కుండల కొట్లాట తెచ్చిన రేవంత్ సర్కార్‌ను ఆడబిడ్డలు అసహ్యించుకుంటున్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే, ఎద గాయమై, పెంచిన పైరుకే రైతన్నలు తలకొరివి పెడుతూ అల్లాడుతున్నారు. అటువైపు దృష్టి నిలపకుండా, రేవంత్ వందిమాగధులు పగ, ప్రతీకార రాజకీయాలకే రాత్రీపగలు ఖర్చు చేస్తున్నారు.
వాస్తవానికి మహిళల కన్నీటికి కారణమై, వంటింట్లో రోదన రగిలించిందే బీజేపీ ప్రభుత్వం. డబ్ల్యూపీఐ, వినియోగదారుల ధరల సూచీ ప్రకారం.. మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్ల గడిచిన పదేండ్లలో నిత్యావసర సరుకుల వారాంత వ్యయం 68 శాతం పెరిగింది. ద్రవ్యోల్బణం, కరెంట్ కోతల వల్ల పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తిలో కోత పడి, ఆదాయానికి గండి పడి, సామాన్యుడి నిత్య జీవితం సంక్షోభంగా మారిందని అనేక నివేదికలు తేటతెల్లం చేశాయి. పైగా పెద్దనోట్ల రద్దు, కరోనా సమస్య ఉపాధికి ముప్పుగా మారి, జనాల జేబుల్లో అప్పుల పత్రాలు నింపాయి. మోదీ ఆర్థికమంతా తప్పయి, దేశమంతా అప్పు అయ్యింది. దశాబ్దంలోనే మోదీ సర్కార్ రూ.100 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల హెచ్చరికలకూ కారణమైంది. దీనికి తోడు గడిచిన నలభై ఏండ్లలో దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగిత పెరిగిపోయింది. దేశంలో 60 లక్షలకు పైగా కొలువుల ఖాళీలుంటే.. మోదీ ప్రభుత్వం పదేండ్లలో 6.9 లక్షల ఉద్యోగాలనే భర్తీ చేసింది. ఏటా రెండు కోట్ల కొలువుల భర్తీ హమీ, ఖాతాల్లో రూ.15 లక్షల జమా జుమ్లాతో గద్దెనెక్కిన కమలేషులు, దేశవాసులను కుల్లబొడిచారే గానీ, ఆదెరువు చూపిందెక్కడ? ఇలాంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు నరేంద్రుడి సోదరుడైన రేవంత్‌రెడ్డికి కనపడనే కనపడవు. కానీ ఆడపడుచుల ఆనందమయ జీవితం కోసం అహోరాత్రులు శ్రమించి, మానవీయ పథకాలెన్నో అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వంపై మాత్రం నిద్రలో సైతం ఆడిపోసుకుంటున్నారు.
కేసీఆర్ సర్కార్ అమలు చేసిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, పౌష్టికాహార కిట్, ఆడపిల్ల పుడితే నగదు సహాయం వంటి పథకాలు బాలికల భవితకు బంగారు బాటలు వేశాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి 2023 జూలై 24న ప్రశంసించిన సత్యాన్ని నాటి దినపత్రికలను మరోసారి తిరగేసి పాలకులు తెలుసుకోవాలి. బాలికల గురుకులాలు, షీ టీమ్‌లు తదితర ఎన్నో మహిళాభ్యుదయ పథకాలు అమలు చేసి, మార్కెట్ కమిటీల్లో సైతం రిజర్వేషన్లు కల్పించి ఆడబిడ్డలకు ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు తొవ్వ చూపారు నాటి సీఎం కేసీఆర్. అసలు బీఆర్ఎస్ పార్టీ జెండా రంగు ఎంపికలోనే మహిళా పక్షపాతం ఉందనే సత్యం మొన్న ఖమ్మంలో తెలంగాణ జలవనరుల నిపుణులు వి.ప్రకాశ్ చెబితేనే తెలిసింది. తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ రాజకీయ శక్తిని రూపొందిస్తున్న తొలినాళ్లలో, జెండా రంగు ఎంపిక కోసం రెండు ఖండాల రాజకీయ పటాలను ముందేసుకొని.. ‘అసలు గులాబీ రంగెందుకు? ఏ రాజకీయ పార్టీ వాడలేదు’ అని ప్రశ్నించారట. గులాబీ రంగును సహజంగా మహిళలు ఇష్టపడతారని, పురుషస్వామ్య సమాజం వర్ధిల్లే విపణిలో.. ‘మన పార్టే వివక్షకు విరుగుడు కావాలి. గులాబీ రంగే వాడుదాం’ అని ఆనక కేసీఆర్ ప్రకటించారట. అసలు బీఆర్ఎస్ జెండాలోనే మహిళా సాధికారత ఉంటే.. సీఎం రేవంత్ లాంటి వారు మహిళా వ్యతిరేకిగా గులాబీ పార్టీని నిందించడంలో అర్థముందా?
తెలంగాణలో న్యాయాన్యాయాల మధ్య మళ్లీ ఘర్షణ అనివార్యంగా మారింది. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు జాతీయ పార్టీల విస్తరణ ఉన్మాదానికి, తెలంగాణ రాష్ట్ర హక్కుల పోరాటానికి మధ్య సమరంగా మారిపోయాయి. మోదీ వందిమాగధులలో ఒకరిగా చేరిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీనే కాదు, తెలంగాణ రాష్ట్ర భవితను సైతం పెద్దన్న చేతిలో పెట్టేశారు. తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ఆపదలో పడేసే దిశగా ఆ ఇరువురూ పావులు కదుపుతుంటే.. ఎల్లరూ ఏకమై నిలువరించాల్సిన చారిత్రక సందర్భమిది. ఎండుతున్న పొలాలు, మండుతున్న రైతన్నలు మనల్ని కదలమంటున్నారు. మత్తడి దుంకిన చోట నెత్తురు పారే రాజకీయాలను మన నేల కోరుకోదు. కుట్ర రాజకీయాలను కూల్చే ప్రజాస్వామిక పరిణతిని తెలంగాణ నలుచెరుగులా ప్రదర్శించాలి. పార్లమెంట్‌కు ఢిల్లీ డూడూ బసవన్నలను ఎలా పంపించగలం? ప్రాంతమే ప్రాణంగా పోరాడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే నెగ్గాలి. తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించిన రోజు పాడి పాడి అలసిపోయిన అమరుడు సాయిచంద్.. వేదిక వెనుక నాతో ఒకమాటన్నాడు. ‘అన్నా.. పెద్ద సారు మనకుంటేనే రక్షణనే. కొట్లాడేటోల్లం, కేసీఆర్‌తో కొన ఊపిరి దాకా ఉందాం’ అని అన్నాడు. మిత్రుడు, పాలమూరు పొత్తిళ్ల పంట సాయి మాటలే తెలంగాణకు శాశ్వత కొలమానాలు. బీఆర్ఎస్ ఖాళీ కాదు, కొత్త నెత్తురై పోరు నదిలా పరవళ్లు తొక్కుతుంది.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)