రాగాలు తీసిన రైతన్న నేడు గాయాలపాలాయెనే/ రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయెనే/ నాడు పచ్చాని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న/ వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా/ దేశానికి తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు/ ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు గాస్తున్నడు/ తన పంటను బతికించగా అయ్యో తండ్లాట బడుతున్నడు…’ – రచయిత, గాయకుడు మానుకోట ప్రసాద్ రచించి, పాడిన ఈ గాథ తెలంగాణ రైతుల వ్యథను కళ్లకు కడుతున్నది. యూట్యూబ్‌లో విడుదలైన రెండు రోజులకే సుమారు లక్ష మంది వీక్షించిన ఈ పాట ఇప్పుడు రైతులందరి నోట నానుతుండటం రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న గోసకు అద్దం పడుతున్నది.
రైతన్నకు పంటంటే ప్రాణం. ఆరుగాలం శ్రమించి సాకిన పంటను అన్నదాత కన్నబిడ్డోలే చూసుకుంటడు. కన్నబిడ్డలను పస్తులుంచైనా సరే, తన కుటుంబం కడుపు నింపే భూతల్లి కడుపు నింపుతడు తొలుత. అందుకే ఎరువులు లేక ఎర్రబారి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పంటకు ఊపిరిపోసేందుకు తన ఊపిరిని సైతం పణంగా పెడుతున్నడు. లైన్లలో నిలబడ్డోళ్లు రైతులే కాదని దబాయిస్తున్న కాంగ్రెస్ పాలకుల నిందలను మోస్తున్నడు. పోలీసుల దెబ్బలను కాస్తున్నడు. రక్తపు బొట్టు చిందించైనా పంటకు బువ్వ పెట్టాలని తెగిస్తున్నడు.
నెల రోజులుగా రాత్రనక, పగలనక, ఎండనక, వాననక లైన్లలో నిలబడ్డ రైతులో నేడు సహనం చచ్చి, సాహసం పుట్టింది. ఓపిక నశించి, తెగువ పురుడుపోసుకుంది. అందుకే ఇప్పుడు తెగబడుతున్నడు. నమ్మించి నట్టేట ముంచిన సర్కారును నిలదీస్తున్నడు. క్యూ లైన్లలో నిలబడలేక, రోడ్లపైకి వచ్చి లొల్లి చేస్తున్నరని బరితెగించి మాట్లాడుతున్న ఏలికలపై పోరాటానికి బరిగీస్తున్నడు. రక్తం చిందినా, నెత్తురు పారినా వెరవడం లేదు. పంట కోసం రక్తం చిందించడానికైనా, నెత్తురు కళ్లజూడటానికైనా సిద్ధమంటున్నడు.
ఒకప్పుడు భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన రైతన్న, నేడు ఆ భూమిలో పండే పంట కోసం పోరు సల్పుతున్నడు. నాడు ప్రత్యేక తెలంగాణ అస్తిత్వం కోసం వలస పాలకులపై రాళ్లెత్తిన మానుకోట, నేడు తన అస్తిత్వానికే ముప్పు తెస్తున్న స్వరాష్ట్ర పాలకుల వైఖరిని నిరసిస్తూ మరోసారి రాళ్లెత్తింది. ఎరువుల దుకాణం ముందు నిప్పుపెట్టి అన్నదాతల గుండెల్లో మండుతున్న ఆగ్రహ జ్వాలల సెగను పాలకులకు తగిలేలా చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు పంటను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పాలనలో దొంగలా మారి ఎరువులు దోచుకునే పరిస్థితి వచ్చింది.
ఓట్లేసిన పాపానికి పాలకులను ఏమీ అనలేక అన్నదాత తన చెప్పులతో తానే కొట్టుకునే దుస్థితి వచ్చింది. దీనంతటికి కారకులెవరు? దేశంలో 28 రాష్ర్టాలున్నాయి. కానీ, తెలంగాణ కర్షకులే యూరియా కోసం ఎందుకు కష్టాలు పడుతున్నరు? మన పక్కనున్న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆఖరికి అత్యధిక వరి పండించే పంజాబ్ రాష్ట్రంలోనూ అన్నదాతలు పంటపొలాల్లోనే కనిపిస్తున్నరు. కానీ, మన తెలంగాణలో మాత్రం పొద్దటి నుంచి రాత్రి దాకా ఎరువుల కోసం ఎందుకు పడిగాపులు కాస్తున్నరు? అక్కడే రాత్రంతా ఎందుకు కావలి కాస్తున్నరు? ఈ పాపం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులది కాదా?
దేశంలో 28 రాష్ర్టాలున్నాయి. కానీ, తెలంగాణ కర్షకులే యూరియా కోసం ఎందుకు కష్టాలు పడుతున్నరు?ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆఖరికి అత్యధిక వరి పండించే పంజాబ్ రాష్ట్రంలోనూ అన్నదాతలు పంటపొలాల్లోనే కనిపిస్తున్నరు. కానీ, మన తెలంగాణలో మాత్రం పొద్దటి నుంచి రాత్రి దాకా ఎరువుల కోసం ఎందుకు పడిగాపులు కాస్తున్నరు? అక్కడే రాత్రంతా ఎందుకు కావలి కాస్తున్నరు?
ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లన్నీ ముందుగానే నిండాయి. జూలై నెలలోనే కృష్ణమ్మ సంద్రానికి ఉరకలెత్తింది. దీంతో గతానికి భిన్నంగా రాష్ట్రంలో ముందే సాగు జోరందుకున్నది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే 1.20 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. నిరుడు ఇదే సమయానికి తెలంగాణలో 91.21 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగైంది. అంటే ఈ ఏడాది సుమారు 28 లక్షల ఎకరాలకు పైగా ఎక్కువ భూమి సాగులోకి వచ్చింది. ఇందులో అత్యధికం వరి పంటేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లెక్కన సుమారు 10.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ నిపుణుల అంచనా. కానీ, మొద్దునిద్ర పోయిన కాంగ్రెస్ సర్కార్ ఎవుసాన్ని గాలికొదిలేసింది. ముందస్తు ప్రతిపాదనలు పంపించి, కేంద్రం నుంచి యూరియా సకాలంలో తెప్పించడంలో హస్తం ప్రభుత్వం విఫలమైంది. దానికితోడు పుట్టుకతోనే తెలంగాణపై కక్ష పెంచుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్, మరింత వివక్ష చూపించింది. దీంతో రైతులు నేడు రోడ్డన పడ్డారు.
ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు విరుద్ధంగా కేంద్రం 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించింది. ఇందులో ఆగస్టు నాటికి 8.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ర్టానికి పంపించాల్సి ఉంది. కానీ, తెలంగాణ రైతులపై సవతి తల్లి ప్రేమ అయినా చూపించడానికి మనస్కరించని కేంద్ర ప్రభుత్వం 5.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే పంపించింది. అంటే, ఆగస్టు నాటికి సుమారు 3.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉన్నట్టు లెక్క.
చోటేభాయ్-బడేభాయ్ కలిసి పన్నిన ఈ కుట్రలో తెలంగాణ రైతాంగం బలైంది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర పాలకులు ఒకరిపై మరొకరు నెపం నెడుతూ తప్పించుకోవాలని చూస్తున్నారు. యూరియా కొరత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పగా, ఆపరేషన్ సిందూర్ కారణంగా చైనా నుంచి సకాలంలో యూరియా అందలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పొంతన లేకుండా మాట్లాడారు. ముగిసిందో, లేదో తెలియని ఆపరేషన్ సిందూర్‌కు యూరియాకు అసలు ఏం సంబంధం? ఒకవేళ అదే నిజమైతే ఆ వైఫల్యానికి ఎవరు కారణం? మరోవైపు యూరియా కొరత లేదని బుకాయిస్తూనే, రైతులకు లైన్లలో నిలబడే ఓపిక లేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరియా అందలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పడం హాస్యాస్పదం. రెండేండ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ పోరుకు, యూరియాకు ముడిపెట్టడమంటే మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టినట్టే.
వాస్తవానికి, రాష్ట్రవ్యాప్తంగా లైన్లలో కనిపిస్తున్న వారందరూ చిన్న, సన్నకారు రైతులే. వారంతా పొట్లాడేది ఒక్క బస్తా యూరియా కోసమే. పెద్ద ఆసాములు, భూస్వాములు ఎక్కడా లైన్లలో నిలబడ్డ దాఖలాలు లేదు. మరి వారికి యూరియా ఎక్కడి నుంచి వస్తున్నది? ఇక్కడే అసలు మతలబు ఉంది. రాష్ర్టానికి వస్తున్న యూరియాలో సింహభాగం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నేతలు పక్కదారి పట్టిస్తున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్లో బడా రైతులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నరు. ఇదంతా కేంద్ర, రాష్ట్ర పాలకులకు తెలియనిది కాదు. కానీ, వారిపై చర్యలు తీసుకుంటే కమీషన్లు ముట్టవు కదా! అందుకే, చిన్న, సన్నకారు రైతుల ప్టొటకొట్టి వాళ్లు కడుపు నింపుకొంటున్నరు. పొట్ట పగిలేలా యూరియా బుక్కుతున్నరు.
– (వ్యాసకర్త: ఆస్ట్రేలియా బీఆర్ఎస్ అధ్యక్షులు)
కాసర్ల నాగేందర్‌రెడ్డి