అజ్ఞాతవాసంలోకి వెళ్లబోతూ పాండవులు తమ ఆయుధాలను ఒక శమీవృక్షంపై భద్రపరిచే సన్నివేశంలో మూలంలో లేని విషయాలను కొన్నిటిని తిక్కన కల్పించి చెప్పాడు. ధర్మరాజు చేత శమీవృక్షం ఎక్కించడం, అస్ర్తాలన్నింటినీ చెట్టుకొమ్మకు మూటగా కట్టి అతనితోనే వేలాడదీయించడం, చెట్టుకొమ్మపైనే ఉండి సకల దేవతలను ఉద్దేశించి ఆ ఆయుధాల మూటకు రక్షగా ఉండమని ప్రార్థన చేయించాడు. ఆ ప్రార్థనలో భాగంగా ఆ ఆయుధాల మూట తనకు, అర్జునుడికి తప్ప వేరెవరికీ ఆయుధాల మూటగా కాకుండా ఒక శవం ఆకృతిలో కనపడాలని కోరుకున్నాడు.
భీముడు ఆవేశపరుడు కావడం, కౌరవులంటే పడనివాడు కాబట్టి, ఈ సంవత్సరకాలంలో ఎప్పుడు ఆవేశంలో వచ్చి తన ఆయుధాన్ని తీసుకోవాలని ప్రయత్నించినా ఏదోవిధంగా అతని చేతికి చిక్కకుండా తప్పుకోవాలని కోరుకోవడం, ఇవన్నీ వ్యాసుడు రాయని అమూలక విషయాల్లో భాగాలే! ఈ భాగాన్ని చదువుతుంటే ఇంతగా మార్చి రాయడం సరైనదేనా? అనే సందేహం కలుగుతున్నది.
విరాటపర్వం నుండి వ్యాసభారతాన్ని తెనిగించడం మొదలుపెట్టిన తిక్కన, పర్వం ప్రారంభంలోనే అవసరంలేని కొంత ఉత్సాహాన్ని చూపాడేమో అనే సందేహం కలిగించే విధంగా ఈ అమూలకమైన మార్పులు కనిపిస్తాయి. అరణ్యంలో నడిచి నడిచి అలిసిపోయిన ద్రౌపది ‘నేనిక నడవలేను, విరాటుడి రాజధాని నగరం ఇంకా చాలా దూరం ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది. కనుక ఈ రాత్రికి ఈ అరణ్య ప్రాంతంలోనే ఉండి, తెల్లవారి మళ్లీ ప్రయాణం సాగిస్తే బాగుంటుందేమో!’ అన్నది ధర్మరాజుతో. దానికి అంగీకరించని ధర్మరాజు ‘ఎలాగైనా ఈ రాత్రికి విరాటనగరం ప్రవేశించాల్సిందే!’ అని పట్టుబట్టి, ద్రౌపదిని మోసుకుని రమ్మని అర్జునుడిని పురమాయిస్తాడు. అర్జునుడు ధర్మరాజు చెప్పినట్లుగానే చేస్తాడు. ఇది వ్యాసుడి భారతంలో చెప్పబడిన సంగతి సారాంశం.
తామాదాయార్జునస్తూర్ణం ద్రౌపదీం గజరాడివ
సమ్ప్రాప్య నగరాభ్యాశమవతారయదర్జునః॥
(వ్యాసభారతం, విరాటపర్వం, 5వ అధ్యాయం, 8వ శ్లోకం)
‘అప్పుడు, గజరాజుతో సమానమైన పరాక్రమవంతుడైన అర్జునుడు ద్రౌపదిని తన భుజాలమీదికి యెత్తుకుని మోస్తూ, విరాటనగరం సమీపించినదని తెలియగానే ఆమెను తన భుజాలపై నుంచి దించివేశాడు’ – అని పైశ్లోకం భావం. వ్యాసుడి మహాభారతంలో ఈ సన్నివేశం కేవలం మూడు శ్లోకాల్లో పూర్తయ్యే ఘటన. ఈ ఘటనను తెలుగు భారతంలో తిక్కన రచించిన విరాటపర్వం, ప్రథమాశ్వాసం, 148వ పద్యం నుండి 155వ పద్యం దాకా (మొత్తం 6 పద్యాలు, రెండు వచనాలకు) పెంచి సాగదీసి కనిపిస్తున్నది.
కం.తన మదిఁ గరుణయు ఖేదం
ఆ. ‘అకట! మనము వచ్చినది గడుదవ్వు,నేఁ
కం.అనిన విని పూని గ్రక్కున
ఆంధ్ర మహాభారతం, విరాటపర్వం, ప్రథమాశ్వాసం, 150, 151, 152 అనే మూడు పద్యాల్లో తిక్కన వివరించిన దానిని బట్టి..ద్రౌపది ఉన్న స్థితికి మనసులో చాలా బాధ కలిగిన ధర్మరాజు, నకులుడికి ద్రౌపదిని చూపించి ‘ఎలాగైనా ఈ రాత్రికి విరాటనగరం చేరాలనే కోరికతో మనం వేగంగా చాలా దూరం నడిచాం. శ్రమతో కూడినదైన ఆ నడకతో ఈమెకు వడదెబ్బ తగిలినట్లుగా ఉంది. కొంత దూరం మోసుకొనిరా!’ అని చెప్పగా, ఆ మాటలకు నకులుడి నుండి సానుకూలమైన స్పందన కానరాలేదు. నకులుడు సుముఖంగా లేడని గ్రహించిన ధర్మరాజు సహదేవుడికి ఆ పనిని పురమాయించాడు. అయినా సుముఖత లేకపోవడంతో అతను కూడా అలిసిపోయి ఉన్నాడని గ్రహించినవాడై – అని పై పద్యాల భావం. ఇంత జరిగిన తరువాత..
వ. సవ్యసాచిం జూచి.
ఉ . ’ఇమ్మదిరాక్షి డస్సె,
మన కీనడుమన్ విడియంగ నొండు చో
టిమ్మును గాదు;నిక్కమున
కేమును డస్సితి;మట్లుగాన నీ
వెమ్మెయినైన దీని భరియించి
పురంబు సమీప భూమికిం
దె’ మ్మని చెప్పనాతఁడును దెచ్చెఁ
బ్రియంబునఁ బుష్పకోమలిన్.
(ఆంధ్రమహాభారతం, విరాటపర్వం, ప్రథమాశ్వాసం, 153 వచనం, 154)
అప్పుడు, అర్జునుడి వైపు తిరిగి ధర్మరాజు ‘ఈమె బాగా అలిసిపోయింది. ఈ రాత్రి విడిది చేసేందుకు ఇక్కడ ఎక్కడా అనువైన ప్రదేశం లేదు. నిజానికి అందరమూ అలిసిపోయి ఉన్నాం. అయినప్పటికీ ఎలాగోలా ఆమెను మాత్రం నీవు మోసుకుని విరాటనగరం చేర్చాలి!’ అని ఆజ్ఞాపించాడు. అన్న చెప్పినట్లు చేశాడు అర్జునుడు – అని పై పద్యం భావం.
వ్యాసభారతంలో ఏం ఉన్నదో తెలుసుకుందామని చూస్తే, ఈ చుట్టు తిరుగుడు ఇక్కడ మొదలై ఇంకా ముందుకు కూడా కొనసాగిందని తెలిసింది. ఆయుధాలను మూటగా కట్టి శమీవృక్షం మీద పెట్టే సందర్భంలో ధర్మరాజు నకులుడిని ఇలా పురమాయించాడని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.
శ్లో. అథాన్వశాసన్నకులం
కున్తీపుత్రో యుధిష్ఠిరః
ఆరుహ్యేమాం శమీం వీర
ధనూంష్యేతాని నిక్షిప॥
(వ్యాసభారతం, విరాటపర్వం, 5వ అధ్యాయం, 28).
‘రాజా! ఆ వెంటనే కుంతి పెద్దకుమారుడైన యుధిష్ఠిరుడు నకులుడిని ఆజ్ఞాపించాడు – వీరుడా! నీవు ఈ శమీవృక్షంపైకి ఎక్కి బంధించి ఉన్న మన ఆయుధాల మూటను భద్రంగా దాచిపెట్టు!’ – అని పై శ్లోకం భావం.
శ్లో. తాముపారుహ్య నకులో
ధనూంషి నిదధే స్వయమ్
యాని తస్యావకాశాని దివ్యరూపాణ్యమన్యత॥
(వ్యాసభారతం, విరాటపర్వం, 5వ అధ్యాయం, 29)
ఆ ఆజ్ఞను శిరసావహించిన నకులుడు,ఆ శమీవృక్షం పైకి యెక్కి బంధించిన వారి ఆయుధాల మూటను ఆ వృక్షపు శాఖల్లో ఖాళీగా ఉన్న గుప్త ప్రదేశంలో అతడి స్వంత చేతులతో భద్రంగా దాచాడు – అని భావం. ఆయుధాల మూటను శమీవృక్షపు శాఖలలో భద్రంగా దాచే సన్నివేశానికి సంబంధించి వ్యాసుడు చెప్పినది ఇంత సూటిగా, సంక్షిప్తంగా ఉండగా, ఆంధ్రభారతంలో, తిక్కన రచనలో అది ఈవిధంగా ఉంది: ‘ఇట్లు పూర్వోక్తప్రకారంబునం బొదివి, మహోరగంబులం బెట్టియలం బెట్టి కట్టు చందంబున బంధించి, వానిం గొనుచు, నయ్యజాతశత్రుండు ధర్మదేవతాదత్త వరుండగుటంజేసి నిశ్శంకంబైన యంతఃకరణంబుతోడ శమీవృక్ష సమారోహణంబాచరించి.’
(ఆంధ్రమహాభారతం, విరాటపర్వం, ప్రథమాశ్వాసం, 173 వచనం). ఈవిధంగా వారి ఆయుధాలను, పాములను పెట్టెల్లో బంధించి పెట్టినట్లుగా మూటగా కట్టి, ఆ మూటను పట్టుకొని ధర్మరాజు తానే సందేహం లేని అంతఃకరణంతో ఆ శమీవృక్షాన్ని ఎక్కాడు – అని భావం. అలా ఎక్కి..
తే. బ్రహ్మ విష్ణు మహేశ దిక్పాల చంద్ర
సూర్య వనదేవతా పితృస్తుతులొనర్చి
దివియు భువియు జూచి ప్రార్థించి, యొక్క
విపుల శాఖ నాయుధములు వ్రేలఁగట్టె.
(174 తేటగీతి)
బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలు, దిక్పాలకులు, సూర్యచంద్రులు, వనదేవతలు, పితృపితామహులను స్తుతించి, భూమ్యాకాశాల వైపు చూసి ప్రార్థించి ధర్మరాజు ఆ మూటను శమీవృక్షపు శాఖకు వేలాడగట్టాడు – అని భావం. అంతటితో ఆగకుండా,
కం. ’నరునకు నాకుం దక్కఁగ
నొరులకు మీరూపు సూపకున్నది; విషవి
స్ఫురిత భుజంగభంగి భయం
కర మూర్తులు దాల్చి యుండఁగా
వలయుఁ జుడీ.(176)
అని కోరుకొంటాడు. అనగా ‘నాకు, అర్జునుడికి తప్ప మిగతావారికి భయంకరమైన విషజ్వాలలు వెదజల్లుతున్న విషసర్పాల వలె కనపడాలి’ అని భావం. అక్కడితో కూడా ఆగకుండా..
ఉ. భీముఁడు ధార్తరాష్ట్రకుల
భీషణరోషుఁడు; చిత్త మెప్పుడె
ట్లై మదమెత్తునో;యతని
యాగ్రహవృత్తికి లోనుగాక మీ
రేమెయినైన వంచన వహించి
తొలంగుట మత్సమీహితం;
బేమఱకుండగా వలయు
నివ్విషమాబ్దములోన నాతనిన్. (177).
అని అంటాడు. ‘ధృతరాష్ట్ర కుమారులంటే భీముడికి ఎప్పుడూ పట్టరాని కోపంగా ఉంటుంది. కాబట్టి వారు చేసిన పనులకు అతడి మనస్సులో ఎప్పుడు ఏవిధమైన రోషం పడగలెత్తి ఎలా ప్రేరేపిస్తుందో ఊహించలేం. కాబట్టి, మీరు అతడికి మాత్రం మీ అసలు రూపాల్లో కనపడకుండా, ఈ ఒక్క సంవత్సరం దాగి ఉండాలి అని నా కోరిక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మాత్రం దయచేసి మర్చిపోవద్దు సుమా!’ అని మరింతగా తన కోరికను వారికి విన్నవించుకున్నాడు. ఇదంతా మూలంలో లేని అదనపు విన్నపాల భాగం. ధర్మరాజు చేత ఈ విధమైన విన్నపాలను చేయించాలని మూలంలో వ్యాసుడు చేయని ఆలోచనను తెలుగు అనువాదంలో తిక్కన చేయడంలోని ఔచిత్యమేమిటో అర్థం కాదు. విరాట పర్వారంభంలో తిక్కన చేసిన ‘మూలంలో లేని ఈ చేర్పులు’ పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు పెద్దరికానికి భంగం కలిగించేవిగా పరిణమించాయి. కనుక ఈ చేర్పుల ఔచిత్యం ప్రశ్నార్హమైనదిగా మారింది.
– భట్టు వెంకటరావు
99591 20528