Rahul Arunoday Banerjee : భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఒడిశాలో జరిగిన పడవ ప్రమాదంలో బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (Rahul Arunoday Banerjee) మరణించాడు. పడవ సీన్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయిన రాహుల్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. దాంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
బెంగాలీ చిత్ర సీమలో ప్రముఖ నటుడైన రాహుల్ అరుణోదయ్ బెనర్జీ పడవ ప్రమాదంలో మరణించాడు. ఒడిశాలోని తల్సారీ సమీపంలోని సముద్రంలో పడవ నడుపుతున్న సీన్ షూటింగ్ చేస్తుండగా అనుకోకుండా నీళ్లలో పడిపోయాడు రాహుల్. నీళ్లలో పడిన రాహుల్‌ను గమనించిన సహాయక సిబ్బంది పరుగున వెళ్లి.. అతడిని బయటకు తీసుకొచ్చారు.
Bengali Actor Rahul Arunoday Banerjee, 43, Dies Due To Drowning During Shoot Of TV Showhttps://t.co/Vh3b7bRQLg
— Free Press Journal (@fpjindia) March 29, 2026
సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మరణించాడని డాక్టర్లు చెప్పారు. రాహుల్ మృతదేహాన్ని దిగా స్టేట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పడవ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని బాలాసోర్ పోలీసుల నుంచి వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. రాహుల్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
కోల్‌కతాలో జన్మించిన రాహుల్ అరుణోదయ్ బెనర్జీ సినిమాలపై ఆసక్తితో నటుడిగా మారాడు. 2008లో ఛిరోదిని తుమీ జే అమర్ సినిమాలో నటనతో బెంగాలీ ప్రేక్షకులకు చేరువయ్యాడు రాహుల్. ఈ సినిమాలో నటించిన ప్రియాంక సర్కార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ 2017లో విడిపోయారు. కానీ, 2023లో మళ్లీ కలిశారు. లవ్ సర్కస్, షోనో మాన్ బోలీ తొమయ్, నా హన్యతే వంటి చిత్రాలతో రాహుల్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.